Sunil kanugolu Master Mind Behind Congress Victory in Telangana Assembly Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ రావడంతో.. సంతోషాల్లో మునిగి తేలుతున్నారు. నేతల నుంచి కార్యకర్తల దాకా తియ్యని వేడుకలు చేసుకుంటున్నారు. అయితే.. ఈ విజయం వెనుక కనిపించని ఓ వ్యక్తి ఉన్నారు. కాంగ్రెస్‌ను గెలుపు వాకిట్లోకి నడిపించిన శక్తి ఆయన! బీఆర్ఎస్ వ్యూహాలకు ధీటుగా ప్లాన్లు గీసిన వ్యూహకర్త అయన! ఆయనే.. సునీల్ కనుగోలు. నిన్న కర్నాటకలో అధికారం హస్తగతం కావడంలో కీలక పాత్ర పోషించిన సునీల్.. ఇవాళ తెలంగాణలోనూ కాంగ్రెస్ సక్సెస్ రిపీట్ చేయడంలో కీ-రోల్ ప్లే చేశారు.
కర్నాటక విజయంతో..
కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో.. సునీల్ కనుగోలు ఘనత విస్తరించింది. ఆయన వ్యూహాల బలం ప్రపంచానికి అర్థమైంది. దీంతో.. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. రంగంలోకి దిగిన కనుగోలు.. తనవైన వ్యూహాలు రచించి, కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంలో ప్రధాన భూమిక పోషించారు.
సునీల్ కనుగోలు, వ్యూహకర్త బలమైన జోడీ నిర్మాణం..
రెండు మూడు నెలల క్రితం వరకూ తెలంగాణ కాంగ్రెస్‌లో.. అంతర్గత విభేదాలు బాహాటంగానే కనిపించేవి. నేతలు మీడియా సాక్షిగానే విమర్శనాస్త్రాలు సంధించుకునేవారు. కానీ.. కనుగోలు రాకతో పరిస్థితి మారిపోయింది. ఆయన వ్యూహాల అమలుకు.. కాంగ్రెస్ నేతలు సైతం చేయి కలిపారు. రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండడం.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ మూడో దఫా గెలుపు పట్ల ధీమా ప్రదర్శించడంతో.. ఏకతాటిపైకి రావడం హస్తం నేతలకు అనివార్యమైంది. ఆ విధంగా.. కనుగోలు వ్యూహాలను రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు సక్రమంగా అమలు చేయడంలో కాంగ్రెస్ నాయకత్వం సక్సెస్ అయ్యింది. ఫలితంగా.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
పదునైన వ్యూహాలు..
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిధ్వనించిన "PayCM" వెనక ఉన్నది ఆయనే అంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా.. సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపడంలోనూ సునీల్ సక్సెస్ అయ్యారు. అవినీతి ప్రచారాన్ని ప్రజల ముందు తీసుకెళ్లడంతోపాటు.. జనాకర్షక సంక్షేమ పథకాలకు ప్లాన్ గీయడంలోనూ కనుగోలు పాత్ర పెద్దదేనని చెబుతారు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ప్రచారాలు చాలా సారూప్యతలు ఉండడాన్ని మనం గమనించవచ్చు. వీటి వెనుక ప్రధానంగా కనుగోలు ఉన్నారు.
ఆ రెండు రాష్ట్రాల్లోకి ప్రవేశించారు కానీ..
తెలంగాణలో కాంగ్రెస్ జయకేతనం ఎగరేయగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో మాత్రం పరాజయాలను చవిచూసింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో సునీల్ వ్యూహాలు ఉన్నాయి. కానీ.. అక్కడ విజయం దక్కలేదు. దీనికి అక్కడి నేతలే కారణమనే ప్రచారం ఉంది. అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్.. సునీల్ వ్యూహాలను సరిగా అమలు చేయలేదని అంటున్నారు. రాజస్థాన్ ఎన్నికల్లో సునీల్ సూచనలను గెహ్లాట్ అంగీకరించలేదని సమాచారం. మరో ప్లాన్ అమలు చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ప్రచారం సాగుతోంది. కర్నాటక, తెలంగాణలో కనుగోలు ఫార్ములా విజయవంతం కావడానికి.. ఆయన టీమ్‌కు పూర్తి స్వేచ్ఛతో పనిచేసే అవకాశం కల్పించడమే కారణమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అలా ఎదిగిన కనుగోలు..
కర్నాటక రాష్ట్రానికి చెందిన సునీల్ కనుగోలు.. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన I-PACతో కెరియర్ ప్రారంభించారు. తనదైన టాలెంట్‌తో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ తర్వాత తానే స్వయంగా టీమ్‌ను నిర్వహించే స్థాయికి చేరారు. కనుగోలు గతంలో పలు ఎన్నికల్లో బీజేపీ కోసం పనిచేశారు. 2018లో కర్ణాటకలో బీజేపీతో కలిసి పనిచేసి.. ఆ పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడంలో కీరోల్ ప్లే చేశారు. అంతకు ముందు 2014లో నరేంద్ర మోడీ ప్రచార వ్యూహాలతోపాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో బీజేపీ కోసం పనిచేశారు. తమిళనాడులో డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్‌తో కూడా వర్క్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఇంకా పలు పార్టీలకూ వ్యూహకర్తగా పనిచేశారు.
జోడో యాత్ర ఆలోచన వెనుక..
గతే ఏడాది కాంగ్రెస్‌తో చేరిన కనుగోలు.. కర్ణాటకలో ఆ పార్టీ గెలుపు కోసం అన్ని విధాలుగా కృషి చేశారు. రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'భారత్ జోడో యాత్ర'కు వ్యూహరచన వెనుక కనుగోలు ఉన్నారు. ఇప్పుడు వరుసగా.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించడంతో.. ఆయన పేరు మార్మోగుతోంది. దీంతో.. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం సునీల్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.