Telangana Assembly Election Results 2023 Live :"మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి" నినాదంతో ఎన్నికల సమరం సాగించిన హస్తం పార్టీ, స్పష్టమైన మెజార్టీతో అధికార బీఆర్ఎస్ను గద్దె దించటంలో సఫలీకృతమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అంతగా ప్రభావం చూపని చోట కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోయింది. గులాబీ పార్టీకి కంచుకోటగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో సత్తాచాటి సొంతబలంతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
ఉమ్మడి ఖమ్మంలో సత్తాచాటిన కాంగ్రెస్ పార్టీ :2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనంలోనూ ఉమ్మడి ఖమ్మంలో 9 నియోజకవర్గాలను గెల్చుకుని సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ, ఈ ఎన్నికల్లోనూ అదేస్థాయిలో సత్తాచాటింది. బీఆర్ఎస్ తరఫున భద్రాచలంలో తెల్లం వెంకట్రావు మినహాయిస్తే, మిగతా వారందరూ ఓటమి పాలయ్యారు. అశ్వారావుపేటలో ఆదినారాయణరావు, ఇల్లెందులో కోరం కనకయ్య విజయం సాధించారు. పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధిరలో మల్లు భట్టి విక్రమార్క, వైరాలో మాలోతు రాందాస్, సత్తుపల్లి మట్టా రాగమయితో పాటు మిత్రపక్షం సీపీఐ తరఫున కొత్తగూడెంలో పోటీచేసిన కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు.
కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్
District Wise Assembly Election Results 2023 :అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూహస్తం పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 12 నియోజకవర్గాలకు 2018 ఎన్నికల్లో హుజుర్‌నగర్, నకిరేకల్, మునుగోడులో మాత్రమే గెలుపొందిన కాంగ్రెస్, మిగతా అన్ని స్థానాలను కోల్పోయింది. ఈ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట మినహాయిస్తే, అన్నిచోట్ల విజయఢంకా మోగించింది. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి జగదీశ్‌రెడ్డితో హోరాహోరీగా తలపడిన కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్‌లో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆలేరులో బీర్ల ఐలయ్య, భువనగిరిలో కుంభం అనిల్ కుమార్‌రెడ్డి విజయం సాధించారు. దేవరకొండలో బాలునాయక్, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి తనయుడు కుందూరు జైవీర్‌రెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, కోదాడలో ఉత్తమ్ పద్మావతి, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, తుంగతుర్తిలో మందుల సామేలు విజయం సాధించారు.
Mahabubnagar Election Results 2023 Live : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో హస్తం హవా కొనసాగింది. 14 అసెంబ్లీ స్థానాలున్న ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ 12చోట్ల గెలుపొందగా, బీఆర్ఎస్ 2 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థులు కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేటలో వంశీకృష్ణ, దేవరకద్రలో మధుసూధన్ రెడ్డి, జడ్చర్లలో అనిరుధ్‌రెడ్డి, కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్‌లో యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్‌లో వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్‌లో రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్‌లో చిట్టెం పర్ణికారెడ్డి, షాద్‌నగర్‌లో శంకరయ్య, వనపర్తిలో మేఘారెడ్డి విజయం సాధించారు. కేవలం రెండు స్థానాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అలంపూర్‌లో విజయుడు, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రమే గెలుపొందారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఓటమి పాలయ్యారు.
Warangal Election Results 2023 Live : తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. హస్తం హవాకు 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మంత్రి ఎర్రబెల్లికి సైతం పరాజయం తప్పలేదు. జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి మినహాయిస్తే, బీఆర్ఎస్కు చెందిన మిగతా అభ్యర్థులందరూ ఓటమి చెందారు. ములుగు నుంచి సీతక్క, మహబూబాబాద్ నుంచి మురళీనాయక్, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, వర్ధన్నపేట నుంచి నాగరాజు, భూపాపల్లిలో గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ స్థానంలో నాయిని రాజేందర్‌రెడ్డి, డోర్నకల్‌లో రామచంద్రనాయక్ గెలుపొందారు.
Karimnagar Election Results Live 2023 : రాష్ట్రావిర్భావం అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లోనే కాకుండా ఉద్యమ సమయంలో జరిగిన ఉపఎన్నికల్లో కారుకు జైకొట్టిన ఉమ్మడి కరీంనగర్ ప్రజానీకం, ఈ ఎన్నికల్లో మాత్రం విభిన్న తీర్పునిచ్చింది. 13 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో 2014లో 12 స్థానాలను, 2018లో 11 నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో మంథనిలో మాత్రమే గెలుపొందిన హస్తం పార్టీ, ఈ సారి 8 నియోజకవర్గాలను కొల్లగొట్టింది. బీఆర్ఎస్ ఐదు నియోజకవర్గాలకే పరిమితమైంది.