Tejas deal with Malaysia: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం 'తేజస్' మన మిత్రదేశాల అమ్ములపొదిలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ అద్భుత లోహ విహంగాల కొనుగోలుకు మలేసియా ఆసక్తి చూపుతోంది. చైనా, రష్యా యుద్ధవిమానాలను తోసిరాజని తేజస్ వైపు మొగ్గుతుండటం మన వైమానిక తయారీ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది. ఈ అంశంపై ఒప్పందం ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాల మధ్య తుది దశ చర్చలు జరుగుతున్నాయి.
తన వైమానిక దళంలో పాతబడిపోతున్న రష్యన్ తయారీ మిగ్-29 యుద్ధవిమానాల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడానికి మలేసియా కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు చైనాకు చెందిన జేఎఫ్-17, దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన ఎఫ్‌ఏ-50, రష్యా రూపొందించిన మిగ్-35, యాక్-130 యుద్ధవిమానాలను పరిశీలించింది. వీటి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ తేజస్‌పైనే మలేసియా ఆసక్తి చూపుతోందని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) సీఎండీ ఆర్.మాధవన్ పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా మలేసియాలో యుద్ధవిమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ భారత్ ముందుకొచ్చింది.