PM Modi Red Fort Speech: సిక్కుల మతగురువు తేగ్ బహుదూర్ 400వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే చోటు వద్ద కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగాన్ని నిర్వహించనున్నారు. తేగ్ బహుదూర్కు మరణశిక్షకు అప్పటి ముఘల్ రాజు ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
గురువారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రధాని మోదీ రాత్రి 9.30 గంటలకు ప్రసంగించనున్నారు. మతసామరస్యంపైన ప్రధాని ప్రసంగించనున్నట్లు అధికారులు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల సమయంలో కాకుండా ఈ ప్రాంతంలో ప్రధాని ప్రసంగించడం ఇది రెండోసారి. అంతకుముందు.. 2018లో స్వాతంత్ర్య యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ప్రభుత్వం స్థాపించి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసగించారు. అయితే అప్పుడు ఆ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటలకు నిర్వహించారు.