తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీస్తా సెతల్వాద్​కు మధ్యంతర బెయిల్.. పాస్​పోర్ట్ సమర్పించాలని సుప్రీం ఆదేశం - తీస్తా సెతల్వాద్ మధ్యంతర బెయిల్

Teesta Setalvad Supreme Court : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పాస్​పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. సాధారణ బెయిల్ పిటిషన్​పై నిర్ణయం గుజరాత్ హైకోర్టుదేనని స్పష్టం చేసింది.

Teesta Setalvad Supreme Court
Teesta Setalvad Supreme Court

By

Published : Sep 2, 2022, 4:51 PM IST

Teesta Setalvad Supreme Court : సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్​కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు ఆధారాలను రూపొందించారన్న ఆరోపణలపై ఆమె జూన్ 25న అరెస్టయ్యారు. ఈ కేసులో బెయిల్​ కోసం తీస్తా చేసుకున్న దరఖాస్తుపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం.. ఆమెకు ఊరట కల్పించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం.. సాధారణ బెయిల్ పిటిషన్​పై గుజరాత్ హైకోర్టు నిర్ణయం తీసుకునేంతవరకు పాస్​పోర్ట్​ను ట్రయల్ కోర్టు వద్ద సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని స్పష్టం చేసింది.

ఈ కేసులో అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు తీస్తా సెతల్వాద్​కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. గుజరాత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం సహా, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని జులై 30న న్యాయస్థానం పేర్కొంది. సెతల్వాద్​తో పాటు గుజరాత్ మాజీ డీజీపీ శ్రీకుమార్​లకు బెయిల్ నిరాకరించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరువురూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ జరుపుతున్న గుజరాత్ హైకోర్టు.. ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 19న చేపట్టనుంది. ఈలోగా మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు తీస్తా.

కుట్ర కోణంపై దర్యాప్తు..
కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్​ అండతో మోదీ సర్కారుకు వ్యతిరేకంగా చేపట్టిన భారీ కుట్రలో సెతల్వాద్, శ్రీకుమార్ భాగమన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు సెక్షన్ 468, సెక్షన్ 194 ప్రకారం దాఖలైన కేసులపై అహ్మదాబాద్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపడుతోంది. ఈ కేసులోనే ముంబయి శాంటాక్రూజ్‌లోని నివాసంలో సెతల్వాద్‌ను జూన్ 25న అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details