రెండేళ్లుగా అత్యాచారానికి గురవుతున్న ఓ బాధితురాలు చేతిపై నిందితుడి పేరు రాసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబీలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు వేధింపులకు గురవుతున్నట్లు తల్లిదండ్రులకు ముందే తెలిసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
ఇదీ జరిగింది..: బాధితురాలిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన నిందితుడు కలీమ్.. ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించాడు. వీడియోను వైరల్ చేస్తానని బెదిరిస్తూ బాధితురాలిపై తరచూ అచ్యాచారానికి పాల్పడేవాడు. కొన్నాళ్లకు బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వారు ఆమెను వేరే గ్రామంలోని బంధువుల ఇంటికి పంపించి అక్కడే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు.
అయినా నిందితుడు వేధించడం మానలేదు. దీంతో విసిగిపోయిన బాధితురాలు ఇంటికి తిరిగివచ్చేసింది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంపై అనుమానించిన పొరిగింటి వారు విషమ పరిస్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెను ప్రాణాలు విడిచింది.