ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసి.. అందుకు నిరాకరించిన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు మరణించింది. 12 రోజులపాటు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం బాధితురాలి గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఈ నెల 7న బాధితురాలిపై అత్యాచారయత్నం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీలీభీత్ జిల్లాలో మాధోతండా పోలీస్ స్టేషన్ పరిధిలో 17 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన రాజ్వీర్ అనే యువకుడు బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అందుకు బాలిక ప్రతిఘటించడం వల్ల ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.
బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఈ నెల 11న ఆమెను లఖ్నవూలోకి ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనమైంది. ఇందులో ఇద్దరు నిందితులు తనపై దాడి చేసినట్లుగా బాలిక ఆరోపించింది. ఈ వీడియో వైరల్ కావడం వల్ల జిల్లా ఎస్పీ, ఏఎస్పీ స్పందించారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి.. జైలుకు పంపారు.