Teenage Girl Murder: 17 ఏళ్ల బాలికను చంపిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని పాల్ఘడ్లో ఈ ఘటన జరిగింది. నిందితుడిని అభిషేక్ షాగా గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఓ మైనర్‌తో కలిసి హాటల్లో బసచేసిన నిందితుడు అభిషేక్ షా.. కొంత సమయం గడిచాక భోజనానికి వెళ్తున్నానంటూ హోటల్ సిబ్బందికి చెప్పి బయటకు వెళ్లాడు. ఎంతసేపు అయినా తిరిగిరాకపోవడం వల్ల సిబ్బందికి అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా బాలిక మంచంపై శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలించగా.. బొరివలి సబర్బన్ రైల్వే స్టేషన్ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. తనకు రూ. 15వేల ఇవ్వకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని అభిషేక్ బెదిరించాడని.. డబ్బులు ఇచ్చేందుకు బాలిక నిరాకరించడం వల్ల ఆమెను చంపేసి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.