Army Chopper Crash : అరుణాచల్‌ప్రదేశ్‌లో కుప్పకూలిన సైనిక హెలికాఫ్టర్ ఘటనలో ఉన్నతాధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై కారణాలు విశ్లేషించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ విధించి విచారణ చేస్తున్నారు. ఘటన సమయంలో హెలికాప్టర్ ఎగిరేందుకు వాతావరణం బాగానే ఉందని.. పైలట్లకు తగినంత అనుభవం ఉన్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. ఇద్దరు పైలట్లకు కలిపి 600 గంటలకు పైగా అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ నడిపిన అనుభవం ఉందని పేర్కొన్నారు. విడివిడిగా వీరిద్దరికీ 1800 గంటలకుపైగా నడిపిన అనుభవం కలిగి ఉన్నట్లు వివరించారు.
ప్రమాదానికి గురైన హెలికాప్టర్ 2015 జూన్‌లో విధుల్లోకి చేరినట్లు తెలిపారు. హెలికాప్టర్ కూలిపోవడానికి కొద్దిక్షణాల ముందు.. సాంకేతిక లోపంతో ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం లేక్‌బాలి నుంచి బయల్దేరిన వైమానిక దళ హెలికాప్టర్ మిగ్గింగ్ సమీపంలో ఉదయం 10 గంటల 43 నిమిషాలకు .. ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో మెుత్తం ఐదుగురు ఉన్నారని.. అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదో వ్యక్తి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టగా.. శనివారం మధ్యాహ్నం మృతదేహం బయటపడింది. దీంతో హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మరణించినట్లైంది. ఐదో మృతదేహం లభించినట్లు వెల్లడించిన అధికారులు.. సహాయక చర్యలు ముగిసినట్లు స్పష్టం చేశారు.