కరోనా కారణంగా సుదీర్ఘ కాలంపాటు ఇళ్లకు పరిమితమైన చిన్నారులకు పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా వినూత్న స్వాగతం లభిస్తోంది. తమిళనాడు శివగంగైలోని ఓ ప్రాథమిక పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఓ గజరాజు ఘన స్వాగతం పలికింది. స్థానికంగా గల షణ్ముగనాథన్ ఆలయంలో ఉండే..గజరాజుతో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆహ్వానం పలికించారు. కరోనా వ్యాప్తి తరువాత తొలిసారి పాఠశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ అరుదైన స్వాగతాన్ని అందించారు.
అటు కేరళ కోజికోడ్‌లోని MIUP పాఠశాల విద్యార్థులకు ఇదే తరహాలో ఘనస్వాగతం లభించింది. సుదీర్ఘ విరామం తరువాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మేళ తాళాలతో ఆహ్వానం పలికింది. విద్యార్థులపై పూలు చల్లుతూ ఉపాధ్యాయులు వారిలో ఉత్సాహాన్ని నింపారు.