ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ్‌లో అమానవీయ ఘటన జరిగింది. ఉపాధ్యాయులు కొట్టడం వల్ల 9వ తరగతి విద్యార్థి మృతిచెందాడు.
ఛిబరమవు కొత్వాలి పరిధిలోని కసవ గ్రామానికి చెందిన జహంగీర్‌కు 15 ఏళ్ల కుమారుడు దిల్షాన్ ఉన్నాడు. అతడిని జులై 23న స్థానిక పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దిల్షాన్‌ను పిలిచిన ఉపాధ్యాయులు శివకుమార్.. గది తలుపులు మూసేశారు. అనంతరం మరో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రభాకర్, వివేక్ వచ్చి.. తోటి విద్యార్థి వాచీ దొంగతనం చేశావంటూ దారుణంగా కొట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న బంధువులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం కాన్పుర్‌కు పంపించారు వైద్యులు. చికిత్స పొందుతున్న క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి బాలుడు మరణించాడు. అనంతరం బాలుడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి గ్రామానికి తరలించారు. అయితే తమ కుమారుడు వాచీ దొంగలించాడనే కారణంతో కొట్టారని.. కానీ ఆ వాచీని మరొకరు అతడి బ్యాగులో పెట్టాడని తండ్రి ఆరోపించాడు.