విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే తన విధులను మరిచి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్.. బాలికలతో అర్ధనగ్నంగా డ్యాన్స్‌లు చేయించాడు. వాటిని వీడియోలు తీసి ఆనందించాడు. స్కూల్లో జరిగిన ఈ విషయం గురించి బయట ఎవరికి చెప్పవద్దని వారిని కొట్టి మరీ బెదిరించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.
అసలేం జరిగిందంటే..?
జబల్పుర్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో రామ్‌సింగ్ ఠాకూర్ అనే టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే రామ్‌సింగ్ మార్చి 11న.. 4, 5వ తరగతి చదువుతున్న కొందరు బాలికలతో పాఠశాల గదిలో బలవంతంగా అర్ధనగ్నంగా డ్యాన్య్లు చేయించాడు. ఇష్టం లేకపోయినా సరే టీచర్ బలవంతంతో బాలికలు డ్యాన్సులు చేశారు. పిల్లలు చేసిన ఆ నృత్యాలను ఆ టీచర్ తన ఫోన్లో వీడియోలు తీశాడు. ఈ విషయం ఎవరికి చెప్పవద్దని కర్రతో కొట్టి మరీ బెదిరించాడు. అయితే ఓ బాలిక భాదపడుతూ తన తల్లితో జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో విషయం బయటకు రాగా మరో బాలిక కూడా స్కూల్లో బలవంతంగా డ్యాన్స్‌లు చేసినట్లు తన తల్లికి చెప్పింది. దీంతో టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు జరిగిన విషయంపై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలికి తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఆమె బాధిత కుటుంబీకులతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి.. మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా లేని టైమ్‌లో ఆ టీచర్ ఇలా ఎందుకు డ్యాన్స్‌లు చేయించాడనే దానిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.