పచ్చదనంపై ప్రేమతో..30లక్షలను ఖర్చుచేశాడు! పర్యావరణ పరిరక్షణ పట్ల అమితాసక్తి కలిగిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన సొంత డబ్బుతో పరిసరాలను పచ్చదనంతో నింపేస్తున్నారు. ప్రభుత్వ భూములను దట్టమైన అటవీ ప్రాంతంగా మారుస్తున్నారు. ఆహ్లాదకరంగా ఉండే పచ్చికబయళ్లను తయారుచేస్తున్నారు. పర్యావరణ పరిరక్షకునిగా పేరుగాంచుతూ..ప్రకృతి పట్ల, పచ్చదనం పట్ల పలువురికి అవగాహన కల్పిస్తున్నారు.
కర్ణాటక రామనగర జిల్లా చన్నపట్న మండలం భూహల్లి గ్రామానికి చెందిన పుట్టస్వామి.. ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. 32 ఏళ్లపాటు ఉద్యోగంలో కొనసాగారు. ఆయనకు చిన్నప్పటి నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి ఉంది. పదవీ విరమణ పొందిన తర్వాత తన ఆసక్తి వైపు జీవితాన్ని సాగించారు.
పొయెట్రీ గార్డెన్..
వెలవెలబోతున్న 20 పార్కులను పచ్చగా మార్చారు పుట్టస్వామి. వేలకొద్ది విభిన్న రకాల మొక్కలను నాటి వాటికి రక్షకునిగా మారారు. తన స్వగ్రామంలో 3 ఎకరాల మైదానాన్ని పొయెట్రీ గార్డెన్గా మార్చారు. ఇప్పుడు ఆ గార్డెనే వివిధ రకాల జంతువులు, పక్షులకు నిలయంగా మారింది. చన్నపట్నం-సాతనుర్ రహదారిలోని మహదేశ్వరా దేవాలయానికి దగ్గరలో 3 ఎకరాల్లో ఉన్న జీవేశ్వర అటవీ ప్రాంతాన్ని పుట్టస్వామే నిర్మించారు.
పర్యావరణ అవగాహన దిశగా..
చన్నపట్నం మొత్తాన్ని పచ్చదనంతో నింపేయడానికి పుట్టస్వామి నిరంతరం కష్టపడుతున్నారు. ఖాళీ ప్రదేశం ఉన్న చోట మొక్కలు నాటి వాటిని పెంచుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి రహదారులను పచ్చదనంతో నింపేస్తున్నారు. పర్వావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించేలా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తన వద్ద ఉన్న రూ.30లక్షలు ఖర్చు చేశారు.
ఇదీ చదవండి:తేజస్వీ త్యాగి.. ఓ సవ్యసాచి!