మహారాష్ట్ర ముంబయిలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో రోగుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అత్యవసర వాహనాలు అనివార్యమయ్యాయి. అయితే.. కొన్ని వీధుల్లో రోడ్లు మరీ చిన్నగా ఉన్నందున అంబులెన్స్‌లు వెళ్లడం కష్టమైంది. ఫలితంగా.. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గ్రహించిన ఓ ఉపాధ్యాయుడు.. నేనున్నానంటూ ముందడుగేశారు. వారికోసం ఓ ఆటోను ఏర్పాటుచేసి.. తానే స్వయంగా ఆస్పత్రిలో చేర్పిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు దత్తాత్రేయ సావంత్.
ఉపాధ్యాయుడే డ్రైవరై..
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన సావంత్.. ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆయన ఓ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే.. ముంబయి ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగిపోవడం చూసి చలించిపోయారు సావంత్. తన వంతు కృషిగా వారికి ఏదో ఒకలా సాయపడాలనుకున్నారు. అందులో భాగంగా తన ఆటోను అంబులెన్స్‌గా మార్చి.. కొవిడ్ రోగులకందరికీ ఉచిత సేవలందిస్తున్నారు.
"కొవిడ్ బాధితులను ఉచితంగా ఆస్పత్రికి తీసుకెళ్లడం, డిశ్ఛార్జి అయ్యాక తిరిగి వాళ్లను ఇంటికి చేర్చడం వంటి పనులు చేస్తున్నాను. ఈ క్రమంలో నేను అన్ని భద్రతా చర్యలను పాటిస్తున్నాను. సమయానికి అంబులెన్సులు రాని కారణంగా.. ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అది చూసి చలించిపోయాను. అందువల్లే ఈ రకంగా వారికి నావంతు సాయమందిస్తున్నాను."