Teacher Beats Student : ఆహారం వడ్డించే పాత్రకు చేయి తగిలిందని.. దళిత బాలికను కులం పేరుతో దూషించి.. తీవ్రంగా కొట్టాడు ప్రధానోపాధ్యాయుడు. దివ్యాంగ బాలిక అని చూడకుండా వేడి నీటిని ఆమెపై పోశాడు. ఇదేంటని అడగడానికి వచ్చిన బాలిక తండ్రిని సైతం కులం పేరుతో దూషించాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో జరిగింది.
టికైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచౌలి గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. రోజు లాగానే ఆగస్టు 29న బాలికను పాఠశాలకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు వెళ్లగా.. ఆహరం వడ్డించే పాత్రకు చేయి తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ అమీన్ కులం పేరుతో దూషించాడు. దాంతో ఆగకుండా వేడి నీరును బాలికపై పోశాడు. చేయి కాలిన బాలిక ఏడుస్తూ వెళ్లి తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి అనంతరం పాఠశాలకు రాగా.. అతడిని సైతం కులం పేరుతో దూషించాడు ప్రధానోపాధ్యాయుడు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి. దీనిపై విచారించిన విద్యాశాఖ అధికారులు.. ప్రధానోపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాల విద్యార్థినికి వేధింపులు.. : పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని వేధిస్తున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికను వెంబడిస్తూ వేధిస్తున్నాడు ఓ ఆకతాయి. ఆకతాయి వేధింపులు తాళలేక చదువును సైతం మధ్యలోనే నిలిపివేసింది బాలిక. పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.