గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ శ్మశానవాటికలో ముస్లిం వ్యాపారి నడుపుతున్న టీ దుకాణం ఖాతాదారులకు అదృష్టం తెస్తుందనే నమ్మకం బలంగా ఉంది. 'లక్కీ టీ స్టాల్'గా పేరుతో ఉన్న ఈ హోటల్‌లో సమాధులకు అటూ ఇటూ వేసిన బల్లలపై పూర్తిగా శాకాహారమే వడ్డిస్తారు. ఇక్కడ మొత్తం 26 సమాధులు ఉన్నాయి. టీ స్టాల్ సిబ్బంది రోజూ సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచుతారు. మొదట్లో ఒక వేప చెట్టు కింద తోపుడు బండిపై టీ విక్రయించిన అబ్దుల్ రజాక్ మన్సూరీ క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడంతో సమాధుల మధ్యనే టీ స్టాల్‌ను ప్రారంభించారు.
26 సమాధుల మధ్య టీ స్టాల్.. 60 ఏళ్లుగా వ్యాపారం.. అక్కడ ఛాయ్ తాగితే ఫుల్ 'లక్కీ' అంట!
సాధారణంగా మనం సమాధులను చూస్తే దగ్గరకు కూడా వెళ్లం. కానీ ఓ వ్యాపారి 26 సమాధుల మధ్య ఏకంగా టీ స్టాల్‌ను నడుపుతున్నాడు. 60 సంవత్సరాలుగా అదే వ్యాపారం చేస్తున్నాడు. అంతే కాకుండా ఇందులో టీ తాగితే అదృష్టం వరిస్తుందని అక్కడి ఖాతాదారులు నమ్ముతున్నారు.
ఆరు దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ టీ స్టాల్‌కు హిందువులు, ముస్లింలనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ వస్తారు. ఈ స్టాల్ చూట్టూ అనేక కళాశాలలు, కార్యాలయాలు ఉండటంతో వ్యాపారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇందులో టీ తాగితే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. అందుకే సమాధులపై వస్త్రం కప్పి ప్రార్థిస్తారు. బన్ మస్కా, భారతీయ, చైనీస్ శాకాహార వంటలకు ఈ హోటల్ ప్రసిద్ధి. డిసెంబరు 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. పాత అహ్మదాబాద్‌లోని జమాల్ పూర్-ఖడియా నియోజకవర్గంలో ప్రచారం హోరెత్తుతున్నా, అక్కడి ఈ టీస్టాల్ మాత్రం ప్రశాంతంగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది.