Nara Lokesh Yuvagalam padayatra: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 153 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు, పాదయాత్ర మొదలైనా రోజు నుంచి ఈరోజు దాకా అనేక అవరోధాలు, అడ్డంకులు, ఆంక్షలను అధికమించి.. నేటితో 2వేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. దీంతో యువనేత నారా లోకేశ్.. నెల్లూరు జిల్లా కొత్తపల్లి పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఇది దూరం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణమని ఆయన అభివర్ణించారు.
యువగళం పాదయాత్ర 2వేల కిలోమీటర్లు పూర్తి ప్రజలు, యువతతో ముఖాముఖి కార్యక్రమాలు.. రాష్ట్రంలోని యువత సమస్యల పరిష్కారం కోసం టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర మొదలైన రోజు నుంచి లోకేశ్‌కు అన్ని జిల్లాల ప్రజలు, మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు అడుగడుగున హారతులతో, గజమాలాలతో బాణసంచాలు కాల్చుతూ.. ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలో యువనేత లోకేశ్.. అన్ని వర్గాల ప్రజలతో, రైతులతో, యువతతో, వివిధ రంగాల నిపుణులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక.. ఏయే కార్యక్రమాలు చేయనున్నారో వెల్లడిస్తూ.. ముందుకు సాగుతున్నారు.
153 రోజులు పూర్తి చేసుకున్న యువగళం.. రాష్ట్రంలోనియువత భవిత కోసం నారా లోకేశ్..జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలకు పూజ చేసి ప్రారంభించిన యువగళం పాదయాత్ర నేటితో 153 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. నేటి పాదయాత్రతో 2వేల కిలోమీటర్ల మైలురాయిని కూడా చేరుకుంది. దీంతో లోకేశ్.. నెల్లూరు జిల్లా కొత్తపల్లి వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఇది దూరం మాత్రమే కాదు. ఆంధ్రప్రదేశ్ యువత కలలు, ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రయాణం. నేను వేసిన తొలి అడుగు ప్రజా చైతన్యానికి ముందడుగు అయ్యింది. కొత్తపల్లిలో ఆక్వా రైతులకు చేయూతనిచ్చే ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటుకు శిలాఫలకం సాక్షిగా హామీ ఇస్తున్నాను. ఇదే తరహాలో తదుపరి మైలురాయికి చేరుకుందాం.. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం' అంటూ లోకేశ్ పిలుపునిచ్చారు.
జగన్ పెంచిన పన్నులన్నీ..టీడీపీ వచ్చాక తగ్గిస్తాం..అనంతరం కొత్తపల్లి గ్రామస్థులతో నారా లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమంలో జగన్ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెంచిన పన్నులన్నీ తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తైన సందర్భంగా.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో యువతకు లోకేశ్ అండగా ఉండడం చూసి తాను గర్వపడుతున్నట్లు చెప్పారు. యువతే మన భవిష్యత్తు అని... అభివృద్ధికి మంచి అవకాశాలను కల్పించడం ద్వారా టీడీపీ వారి అపారమైన సామర్థ్యాన్ని గుర్తిస్తుందన్నారు. లోకేశ్ మిగిలిన ప్రయాణానికి కూడా తాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
సంఘీభావ ర్యాలీలు చేపట్టిన టీడీపీ శ్రేణులు..యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో కేక్ కట్ చేసి, సంబరాలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గంగమ్మ గుడి వద్ద 101 కొబ్బరి కాయలు కొట్టి వారి అభిమానం చాటుకున్నారు.