TDP Vs YCP in Punganur: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండలం అంగళ్లు గ్రామం, ఆ తర్వాత చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు విఫలయత్నం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కోసం చంద్రబాబు వచ్చిన సమయంలో.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయినా అధికార పార్టీకి కొమ్ము కాస్తూ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం.. తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కారణమైంది. అంగళ్లు గ్రామంలో చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించేలా తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చించివేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు దిగారు. ఇన్ని జరుగుతున్నా వైసీపీ శ్రేణులను పోలీసులు నియంత్రించలేదు.
వైసీపీ నాయకులు, కార్యకర్తల కవ్వింపు, రెచ్చగొట్టే చర్యల గురించి మార్గం మధ్యలోనే తెలుసుకున్న చంద్రబాబు.. అంగళ్లు గ్రామ సమీపంలోకి రాగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగారు.ఓపెన్ టాప్ వాహనంపైకి ఎక్కి గ్రామ కూడలివరకూ వెళ్లారు. అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను అప్పటివరకు నియంత్రించని పోలీసులు.. చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం అటువైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయినా వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వెంట వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో ఓర్పు నశించింది. వాహనాల్లో నుంచి కింది దిగి జెండా కర్రలతో వైసీపీ శ్రేణులను తరిమికొట్టారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. తెలుగుదేశం వారికి గాయాలయ్యాయి.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ప్రసంగించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి రావణాసురుడిలా రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అంగళ్లు ప్రాంతం నుంచి వెళ్లిపోయిన తర్వాత తిరిగివచ్చిన వైసీపీ కార్యకర్తలు.. మరోసారి విధ్వంసానికి దిగారు. తెలుగుదేశం నాయకుల కార్లను, ‘మహాశక్తి’ వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.