TDP Leader Ayyanna :టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడిని పోలీసులు విశాఖ పట్నంలో అరెస్ట్ చేశారు. అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి ఎలమంచిలిలో విడుదల చేశారు. ఆగస్టు 22న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో భాగంగాగన్నవరంలో బహిరంగ సభ (Gannavaram Public Meeting) జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి, మంత్రి రోజాను కించపరిచేలా ప్రసంగించారంటూ మాజీ మంత్రి పేర్నినాని ఫిర్యాదుపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. తాజాగా అయ్యన్నపాత్రుడుని ఏ కేసు కింద అరెస్టు చేశారో పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. అయ్యన్నను గన్నవరం తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నపై విడి విడిగా కేసులు నమోదయ్యాయి. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రిని ఆర్థిక ఉగ్రవాది (Financial terrorist), సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారని పేర్కొన్నారు. అయ్యన్నపై 153ఏ, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్లు, బుద్దా వెంకన్నపై 153, 153ఏ, 505(2), 506ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సభావేదిక నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారంటూ ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు.
TDP Leader Ayyanna : టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టు.. విడుదల - ఏపీ ప్రధానవార్తలు
Published : Sep 1, 2023, 12:21 PM IST
|Updated : Sep 1, 2023, 3:47 PM IST
12:19 September 01
మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపై కేసు నమోదు
పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు..అక్రమ కేసులతో అయ్యన్నను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Leader Chandrababu) తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్ (Kidnapp) చేసే దారుణ పరిస్థితులు దాపురించాయని, ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే, ప్రశ్నించే అయ్యన్నపై అక్రమ అరెస్టుతో కక్ష సాధిస్తున్నారని దుయ్యబట్టారు.ప్రభుత్వంపై అయ్యన్న విమర్శలే నేరమైతే... మంత్రులు, వైసీపీ నేతలు రోజూ చేస్తున్న వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలని చంద్రబాబు అన్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు..? ధైర్యం ఉంటే విమర్శలకు సమాధానం చెప్పాలి.. జగన్ చేస్తున్న తప్పులు, నేరాల్లో పోలీసులు భాగస్వాములేతే తీవ్ర మూల్యం చెల్లిస్తారని పేర్కొన్నారు.
తీవ్రంగా ఖండించిన లోకేశ్...'అరెస్టులతో మా గొంతు నొక్కలేవు జగన్...నీ అణిచివేతే మా తిరుగుబాటు. అయ్యన్నపాత్రుడు గారి అరెస్ట్ సైకో పాలనకి పరాకాష్ట. అయ్యన్న గారి వ్యాఖ్యలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే సీఎం గా ఉండి జగన్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఏమి అనాలి? వైసీపీ నాయకులు, మంత్రుల బూతులు పోలీసులకు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? రాజారెడ్డి రాజ్యాంగంలో అధికార పార్టీ నాయకులకు ప్రత్యేక హక్కులు కల్పించారా? ప్రజల గళాన్ని వినిపిస్తున్న అయ్యన్న గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను.' అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) పేర్కొన్నారు.
అక్రమాలకు అడ్డొస్తున్నాడనే.. బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం అని శాసనమండలి మాజీ ఛైర్మన్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ పేర్కొన్నారు. గతంలోనూ ఆయన ఇంటిపై పోలీసులతో దాడి చేయించివారి కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను అణచివేసేందుకు కుట్ర పన్నారు అని తెలిపారు. జగన్ రెడ్డి అక్రమాలు, భూదోపిడీ దందాలకు వైజాగ్ లో అయ్యన్న పాత్రుడు అడ్డుపడుతున్నారని అరెస్టు చేయడం హేయం అని పేర్కొన్నారు.