TDP Politburo Meeting at NTR Bhavan: సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ సమయాత్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన, అందులో ఉండాల్సిన అంశాలపై నేతలు కీలకంగా చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేయాలని పొలిట్‌బ్యూరోలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యువతకు తెలిసేలా కార్యక్రమాలు :ప్రతీ పేదవాడిని ధనవంతుడిని చేసేలా మేనిఫెస్టో రూపొందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పేదలకు ఇప్పుడు అందుతున్న దానికన్నా రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో ఉండాలన్నారు. మేనిఫెస్టో రూపకల్పన కోసం కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుంది. అలాగే 4 దశాబ్దాల టీడీపీ ప్రస్థానం నేటి యువతకు తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాలని పొలిట్ బ్యూరోలో తీర్మానించారు. అందుకోసం పార్టీ చరిత్రను ఇంటింటికీ తెలియజేయనున్నారు. టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత తెలుగుజాతి ఎలా ఉందన్న అంశంపై చర్చ జరిగేలా కార్యక్రమాలు రూపొందించనున్నారు. దశాబ్దాల తరబడి ప్రజలను పట్టిపీడించిన అనేక సమస్యలకు టీడీపీ పరిష్కారం చూపిందని తీర్మానించారు.
పార్టీ మేనిఫెస్టో రూప కల్పన.. మహానాడుకు సన్నాహాలు : పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారికి అవకాశాలు కల్పించాలని పైరవీలు చేసేవారికి తావులేకుండా పార్టీని బలోపేతం చేయాలని నేతలు నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో 40శాతం టిక్కెట్లను యువతకే కేటాయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. యువతకు పెద్దపీట వేయడంతోపాటు అనుభవజ్ఞుల సేవలను విరివిగా వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించింది. లోకేశ్ పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతోందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మే 28 వరకు 100 ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్టాల్లోని 42 లోక్‌సభ స్థానాలతోపాటు అండమాన్ నికోబార్, విదేశాల్లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్నచోట నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో రూప కల్పన, మహానాడుకు సన్నాహాలు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు పార్టీ మూడు ప్రత్యేక కమిటీలను నియమించనుంది.
విఫలమైన తెలుగు రాష్ట్ర సీఎంలు : తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి విశ్వసాన్ని కోల్పోయాయని టీడీపీ పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. విభజన హామీలు నెరవేర్చడంలో ఇద్దరు ముఖ్యమంత్రులు విఫలమయ్యారని విమర్శించింది. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల వేధింపులు, భౌతిక దాడులతో ఆర్థికంగానూ దెబ్బతిన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఆదుకునేందుకు టీడీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది.