Chandrababu Naidu Comments మార్చి 29.. రాష్ట్ర చరిత్రను తిరగరాసిన రోజు అని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నాడు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అధికారం కావాలని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని పార్టీ పెట్టారని స్పష్టం చేశారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని చెప్పినట్లు వెల్లడించారు. తెలుగుజాతి వసుదైక కుటుంబంగా ఉండడం మనందరి అదృష్టమని తెలిపారు. తెలుగుజాతిని ఉద్ధరించడానికి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలనా సంస్కరణలు చరిత్రలో ఎక్కడా లేవని స్పష్టం చేశారు. మానవత్వమే తన సిద్ధాంతమని చాటి చెప్పారన్నారు. ఎక్కడ పసుపు ఉంటే అక్కడ శుభసూచకమన్న చంద్రబాబు.. అందరి అవసరం కోసం.. అందరి కోసం తెలుగుదేశం పార్టీ ఉందని వివరించారు.
మార్చ్ 29 చరిత్రను తిరగరాసింది. తెలుగుజాతి రుణం తీర్చుకోవాలి ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. పది కోట్ల తెలుగువారు ఒక కుటుంభం దానికి ప్రతినిధి టీడీపీ. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ గుర్తు ఉంటారు. ఆహార భద్రతపై ఆలోచించింది ఎన్టీఆర్. ప్రజలవద్దకు పరిపాలన తెచ్చేందుకు మండల వ్యవస్త తెచ్చారు అది వికేంద్రీకరణ. యుగ పురుషుడి శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. -చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు
చరిత్ర ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు. టీడీపీకు ముందు.. తర్వాత అని తెలుగుజాతి గురించి మాట్లాడే పరిస్థితి నెలకొందని వెల్లడించారు. సంక్షేమానికి నాంది పలికిన పార్టీ తెలుగుదేశం అని గొంతెత్తారు. ఆహార భద్రత కోసం రూ.2కు కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. సంస్కరణలకు మారుపేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. నిరుపేదలను చదివించాలని రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ తెచ్చారన్నారు.