TDP Leaders Worried about Chandrababu Naidu security :టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ మావోయిస్టు హిట్‌లిస్ట్‌లో ఉన్న ఆయన్ను మావోయిస్టులు, వాళ్ల సానుభూతి పరులున్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు. ఇక్కడ కరడు గట్టిన నేరగాళ్లు, హంతకులు, ఆయుధాలు వినియోగంలో ఆరితేరినవారు, సుపారీ గ్యాంగులు, రౌడీషీటర్లు, తీవ్ర హింసాత్మక నేరాలకు పాల్పడిన వారు, గంజాయి స్మగ్లర్లు ఉన్నారు. అలాంటి చోట చంద్రబాబును ఉంచటం వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వాదన వినిపిస్తోంది. కారాగారంలో కేటాయించిన బ్యారెక్‌లో తప్ప బయట తిరగొద్దని చంద్రబాబుకు జైలు అధికారులే సూచించారు.
TDP Leaders Said No NSG Commandos for CBN :దీన్నిబట్టే ఆయన భద్రత ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో అర్థమవుతోంది. జైలుకు పంపటంతో అక్కడ ఎన్ఎస్జీ కమాండోల భద్రత లేకుండా పోయింది. కేవలం నలుగురైదుగురు జైలు సిబ్బంది షిఫ్టుల వారీగా కర్రలతో కాపలా ఉంటున్నారు. ఏ మావోయిస్టుల వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి ఎన్ఎస్జీ కమాండోల భద్రత కల్పించారో, అదే మావోయిస్టులున్న చోట ఇప్పుడు ఉంచటంపై ఆందోళన నెలకొంది. ఎన్ఎస్జీ కమాండోల రక్షణ వలయంలో ఉన్న ఆయన్ను ఆ భద్రత నుంచి తప్పించేందుకే అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించారని, దీని వెనుక ఆయన్ను అంతమొందించాలనే కుట్ర ఉండొచ్చని టీడీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
TDP Leaders Protest on CBN Security in Jail: 'జైలులో చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉంది'
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అందరూ లాకప్ బయటే ఉంటారు. వారిలో కరడు గట్టిన నేరగాళ్లు, ఆయుధాలు వినియోగించినవారు, ఇలా అనేక మంది ఉంటారు. లాకప్ బయట తిరుగుతున్నప్పుడు వీరిలో ఎవరైనా చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని భావించి దూసుకెళ్తే వారిని కేవలం కర్రలతో నియంత్రించటం సాధ్యపడుతుందా? కారాగారంలో సిబ్బంది కొరతతో కొంత మంది ఖైదీలనే సిబ్బందిగా వినియోగిస్తూ వారితో పనులు చేయిస్తుంటారు. అలా పనుల కోసం వెళ్లిన వారి వల్ల ముప్పు వాటిల్లదని నమ్మకమేంటి?
CCTV Cameras are Installed at Sneha Block : రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికార పెద్దల కనుసన్నల్లో ఉందని మాజీ హోం మంత్రి చినరాజప్ప వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉన్న కొందరు అధికారుల్ని ఇక్కడ విధులకు నియమించారని వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఇక్కడి సమాచారాన్ని పెద్దలకు చేరవేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గదిలోనూ ఏర్పాటు చేశారని, దాంతో చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.