2023 Mahanadu public meeting: రాజమహేంద్రవరం పసుపు సంద్రమైంది.తెలుగుదేశం మహానాడుకు..పసుపు సైన్యం కదంతొక్కింది. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. ఎన్టీఆర్, టీడీపీతో ఉన్న సంబంధాన్ని గుర్తుకుచేసుకున్నారు.తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ కు గోదావరి గడ్డ అంటే ఎంతో అభిమానమని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్తు చేశారు.
దోపిడీదారుడి చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోంది: ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాకే తెలుగువారికి గౌరవం పెరిగిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నాడు. బలహీనవర్గాలను రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి.. ఎన్‌టీఆర్ అంటూ కొనియాడాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 160 స్థానాలు ఖాయం అంటూ... అచ్చెన్న జోష్యం చెప్పాడు. దోపిడీదారుడి చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోందని ఆరోపించాడు. సీఎం జగన్‌పై 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అచ్చెన్న పేర్కొన్నాడు. సహజ సంపదను దోచుకుని రూ.కోట్లు సంపాదించారని అచ్చేన్న ఆరోపించాడు. ఏపీని ఓ సైకో పాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. జగన్ అక్రమార్జనను చంద్రబాబు బయటకు లాగుతారని స్పష్టం చేశారు. జగన్ అవినీతిని బయటకు లాగాల్సిన అవసరం ఉందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే లోకేశ్ పాదయాత్ర: మన రాష్ట్ర భవిష్యత్ దార్శనికుడు చంద్రబాబు అని తెలుగు మహిళ అధ్యక్షరాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. చెత్తపై పన్ను వేసిన వారిని ఏమంటారు? అంటూ వంగలపూడి అనిత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. వైసీపీలో ఉండే నాయుకులు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. కొందరు నేతలు చేసే కామెంట్స్ ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే లోకేశ్ పాదయాత్ర చేపట్టారాని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఒక్కగానొక్క కొడుకుని జనం కోసం పాదయాత్రకు పంపిన మహాతల్లి భువనేశ్వరికి పాదాభివందనం తెలిపారు. నలభై ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ నాయకులకు భరోసా ఇస్తున్న కార్యకర్తలకు పాదాభివందనాలన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మహానాడు సభకు తరలివచ్చారనీ... అయితే, భారీ వర్షం పడినా టీడీపీ కార్యకర్తలు చెక్కుచెదరలేదని అనిత పేర్కొన్నారు.