TDP Clarity on Telangana Elections Contest :తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో.. ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. టికెట్ దక్కిన నేతలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తూ.. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోవైపు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు నిన్న రాజమండ్రి కారాగారంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని (chandrababu Naidu) కలిశారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి పెట్టలేమని చంద్రబాబు పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందో నాయకులకు వివరించాలని కాసానికి.. ఆయన సూచించారు. చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ సీనియర్ నేతలు తెలంగాణ నేతలకు వివరించారు.
TDP on Telangana Assembly Elections : ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీటీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ.. టీడీపీ కంటే బలంగా ఉందని తాము నమ్మడం లేదని వివరించారు. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంతో.. రాష్ట్రానికి కావాల్సిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు. జనసేనతో ముందుకెళ్లాలా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే 87 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని.. చంద్రబాబు ఆమోదించాక పేర్లు ప్రకటన ఉంటుందని అన్నారు. టీడీపీ తరఫున తెలంగాణలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేస్తారుని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు.