Chandrababu Raithu Porubata Started: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ అధినేత మూడు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని ఈనెలలో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు డెడ్లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలంటూ చంద్రబాబు ‘రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. సుమారు 12 కిలో మీటర్లు చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మార్గంమధ్యలో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. రైతు పోరుబాట ప్రారంభమానికి ముందు ఇరగవరంలోని ఆంజనేయస్వామి గుడిలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు.
పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులను రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని.. తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారని అన్నారు. కల్లాల్లోని ధాన్యం కొనే వరకు రైతుల తరఫున తాము పోరాటం చేస్తామని.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని చెప్పారు. రైతులంతా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతు పోరుబాట పాదయాత్ర.. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని ఈ సందర్బంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.