Chandrababu Fires on CM Jagan: ధాన్యం సమస్యలు పరిష్కారించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతు పోరుబాటలో భాగంగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్ వరకు.. మండుటెండలోనూ చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకొస్తామని 72 గంటలు డెడ్‌లైన్ విధించినా సీఎంలో చలనం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడిపితే... ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆక్షేపించారు.
ధాన్యం విక్రయిస్తే ఎక్కడైనా రైతులకు డబ్బులిస్తారని... కానీ మన రాష్ట్రంలో రైతుల నుంచే దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే... ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పర్యటించే ప్రాంతాల్లో రైతులను ప్రభుత్వం బెదిరిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యం చూపేందుకు వచ్చిన రైతులను పోలీసులు అమానుషంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సామర్థ్యం ఉంటే రైతుల సమస్యలు పరిష్కరించాలి కానీ వారిని భయపెట్టడం తగదన్నారు.
‘‘కొనుగోలు చేయని ధాన్యాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకొస్తానని.. 72 గంటల డెడ్‌లైన్ ఇచ్చినా సీఎంలో చలనం లేదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నిద్రలేని రాత్రులు గడిపితే చేతగాని ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతుల సమస్యలు పట్టించుకోకపోగా నాపై ఎదురుదాడి చేస్తున్నారు. నేను పర్యటించే ప్రాంతాల్లో రైతులను బెదిరిస్తున్నారు. సమస్యలు చెప్పేందుకు వస్తుంటే వారిని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిరసన తెలియజేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని హరించడానికి పోలీసులు ఎవరు?-చంద్రబాబు, టీడీపీ అధినేత
రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల మేర పంట నష్టం జరిగితే ఆ వివరాలు ఎందుకు బయటపెట్టరని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బస్తాకి అదనంగా 2 కిలోలు ఎందుకు తీస్తున్నారో చెప్పాలని నిలదీశారు. రైస్ మిల్లర్లను దళారులుగా మార్చి దోచుకుంటున్నారని ఆరోపించారు.
"రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పరిహారం ఎందుకివ్వరు? ఈ ప్రభుత్వం రైస్‌మిల్లర్లను దళారులుగా చేసింది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు బీమా.. ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకునేవాళ్లం. ఇప్పుడు అవేమీ లేవు. తేమ, మొలక వచ్చిన ధాన్యం కొంటామన్నారు గానీ.. ఎక్కడా కొనలేదు"-చంద్రబాబు, టీడీపీ అధినేత