తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలవరానికి పట్టిన గ్రహణం వీడాలంటే జగన్​ను ఇంటికి పంపాలి: చంద్రబాబు - raa kadalira

TDP Chandrababu Naidu Speech: జగన్‌ విశ్వసనీయత నేతి బీరకాయ చందమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పోలవరానికి గ్రహణం పట్టిందని, గ్రహణం వీడాలంటే జగన్​ని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగసభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

TDP_Chandrababu_Naidu_Speech
TDP_Chandrababu_Naidu_Speech

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 8:17 PM IST

TDP Chandrababu Naidu Speech: నిత్యవసరాల ధరలు పెంచబోమంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగసభలో చంద్రబాబు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులన్నీ నాశనం అయ్యాయని, ఎక్కడైనా కాలవల్లో పూడిక తీశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని ఛార్జీలనూ పెంచేశారని విమర్శించారు.

పోలవరానికి పట్టిన గ్రహణం వీడాలంటే జగన్​ను ఇంటికి పంపాలి: చంద్రబాబుq

వైసీపీ సినిమా పూర్తయ్యింది:ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ-జనసేన గెలుపు ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ సినిమా పూర్తయ్యిందని, ఇక ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా అని నిలదీశారు.

పోలవరానికి గ్రహణం పట్టింది:2019లో పోలవరానికి గ్రహణం పట్టిందని, ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని ధ్వజమెత్తారు. జగన్ వచ్చాక గుత్తేదారులను, అధికారులను మార్చారన్న చంద్రబాబు, పోలవరానికి గ్రహణం వీడాలంటే జగన్‌ ఇంటికి పోవాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు 3 పంటలకు నీరిచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్న చంద్రబాబు, జగన్‌ విశ్వసనీయత నేతి బీరకాయ చందమని విమర్శించారు.

తిరువూరులో తెలుగుదేశం 'రా కదలిరా' బహిరంగ సభ - భారీగా తరలివచ్చిన ప్రజలు

ఆక్వారంగానికి పూర్వ వైభవం: టీడీపీ హయాంలో ఆక్వారంగానికి పెద్దపీట వేశామన్న చంద్రబాబు, జగన్ పాలనలో ఆక్వారంగం పూర్తిగా కుదేలైందని మండిపడ్డారు. ఆక్వారంగంలో సాగు ఖర్చు మూడురెట్లు పెరిగిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఫీడ్‌, కరెంట్ బిల్లులు పెరిగాయని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆక్వారంగానికి రూ.1.5కే కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆక్వారంగానికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత తమదని తెలిపారు.

రైతులకు అన్ని విధాలుగా అండగా: ధాన్యం కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని, సంచులు కూడా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. నీరు సరిగా ఇవ్వక క్రాప్ హాలీడే ఇచ్చే పరిస్థితి తెచ్చారన్న చంద్రబాబు, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు బాగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఊసరవెల్లి రాజకీయాలు చేశారు: ప్రత్యేక హోదా తెస్తామన్నారని, కేంద్రం మెడలు వంచుతామన్నారని మరి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. ఏటా జాబ్ క్యాలెండర్, డీఎస్‌సీ అని ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా అని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి 9 సార్లు చెప్పారన్న చంద్రబాబు, రాజధాని విషయంలో ఊసరవెల్లి రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని మాయమాటలు చెప్పారని, రాష్ట్రానికి ఐదేళ్లపాటు రాజధాని లేకుండా చూసిన ఘనత జగన్‌దే అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ వెలిగిపోతోందని, అమరావతి వెలవెలబోతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న పొరపాటుకు ఐదేళ్ల నరకం- స్వర్ణయుగం కోసం కదలి రావాలని చంద్రబాబు పిలుపు

జగనన్న వదిలిన బాణం ఆయన మీదకే వెళ్తోంది:అమరావతే మన రాజధాని అని, ఇది తథ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు. బాబాయినే చంపిన వారికి మనమో లెక్క అన్న విమర్శించిన చంద్రబాబు, జగనన్న వదిలిన బాణం ఏమైందని అది ఆయన మీదకే వెళ్తోందని అన్నారు. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే సీఎం జగనే అని, జగన్‌ ఆదాయం ఎలా పెరిగిందో ప్రజలు తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు.

తనను, లోకేశ్​, పవన్‌ను తిట్టిన వారికి సీట్లు ఇస్తారని ఆరోపించారు. డయాఫ్రం వాల్‌ అంటే తెలియని వ్యక్తి మనకు నీటిపారుదల మంత్రిగా ఉన్నారని, పెట్టుబడులు అంటే కోడిగుడ్లు అనే వ్యక్తి మనకు ఐటీ మంత్రి అని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేస్తామని తెలిపారు.

తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్‌వన్ కావాలి:ఆనాడు డ్వాక్రా సంఘాలు తెచ్చింది తానేనని, ఆడబిడ్డలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని కోరుకున్నానని స్పష్టం చేశారు. ప్రతి మహిళకు అండగా ఉంటామన్న చంద్రబాబు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని, పేదరికం లేని సమాజమే తన జీవిత ఆశయమన్నారు. తెలుగు ప్రజలు ప్రపంచంలోనే నెంబర్‌వన్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

కనిగిరిలో రెండోరోజు చంద్రబాబు పర్యటన - అన్నా క్యాంటీన్‌ పైలాన్ ఆవిష్కరణ

సంపద సృష్టించడం ఎలాగో తెలుసు: తనకు కష్టం వచ్చినప్పుడు 80 దేశాల్లోని తెలుగువారు స్పందించారన్న చంద్రబాబు, సంపద సృష్టించడం ఎలాగో తమకు తెలుసని అన్నారు. తాడేపల్లిగూడెంకు ఎన్‌ఐటీ తెచ్చామని తెలిపారు. వైసీపీ హయాంలో ఆచంటలో రొయ్యల చెరువు తవ్వాలంటే ముడుపులు కట్టాల్సిందేనని విమర్శించారు. పేదల ఇంటి జాగాకు కూడా రూ.50 వేలు కప్పం కట్టించుకుంటున్నారని ఆరోపించారు. భారతీయ విద్యాభవన్ భూములు కాజేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారన్న చంద్రబాబు, ఆచంట ఎమ్మెల్యే కాజేసిన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

రాయుడును మోసం చేశారు: వైసీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెంలో ఏం చేయాలన్నా అక్కడి నేతకు పన్ను కట్టాల్సి వస్తోందని, జగన్‌లా భీమవరం ఎమ్మెల్యే కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. నరసాపురం నాయకుడు ప్రభుత్వ భూములు కాజేస్తున్నారన్న చంద్రబాబు, అవినీతి చేస్తున్న ఈ నేతలను మారుస్తారా చెప్పాలని ప్రశ్నించారు. పార్టీలో చేరిన వెంటనే జగన్ వైఖరి అంబటి రాయుడుకు అర్థమైందని, గుంటూరు ఎంపీ సీటు ఇస్తామని చెప్పి రాయుడును మోసం చేశారని అన్నారు.

స్వర్ణయుగం రావాలంటే రా కదలి రా: తమ ప్రభుత్వం వచ్చాక పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు బాగు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు తెలివైన వారని అంతటా పేరుందన్న చంద్రబాబు, వైసీపీ నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోకుండా జాగ్రత్తపడాలని సూచించారు. రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే రా కదలి రా అంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికైనా చైతన్యం రాకుంటే రాష్ట్రం అంధకారమే అన్నారు.

కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమైంది - వచ్చే ఎన్నికల్లో పాండవులదే గెలుపు

ABOUT THE AUTHOR

...view details