All Set For TDP Mahanadu: తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, యుగపురుషుడు స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు పసుపు దళం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 27, 28న వేడుకలు జరగనుండగా.. రాజమహేంద్రవరానికి ముందుగానే మహానాడు కళ వచ్చేసింది. ఎన్నికల ఏడాది కావటంతో.. ఈసారి పసుపు పండుగను విజయవంతం చేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది.
నాలుగేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. మహానాడు వేదికను తమకు అనుకూలంగా మలచుకోవటంతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని నిర్ణయించింది. మహానాడు నిర్వహణ పట్లా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోన్నందున ప్రజా క్షేత్రంలో సత్తా చాటేందుకు సవాలుగా తీసుకుని నిర్వహిస్తోంది. సన్నాహక కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇవాళే రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. సాయంత్రం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు అజెండాతో పాటు పార్టీ పరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజమహేంద్రవరం నుంచే సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
మహానాడుకు వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఈ దఫా ప్లీనరీ, బహిరంగ సభ వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో వేడుక జరగనుంది. 27న ప్రతినిధుల సభ, 28న మహనాడు బహిరంగభ నిర్వహించనున్నారు. పార్కింగ్, భోజన స్టాళ్లకు సుమారు 140 ఎకరాల మేర కేటాయించారు. ప్లీనరీ ప్రాంతంలో ప్రధాన వేదిక నిర్మిస్తున్నారు. అందులో ప్రధాన సభతోపాటు 15 వేల మంది కూర్చొనేలా 9 గ్యాలరీలు ఏర్పాటు చేశారు.