టీడీపీ-జనసేన మహాకలయికతో దద్దరిల్లిన విజయోత్సవ సభ- ప్రతిఫలించిన మైత్రీబంధం TDP-Janasena Together in Yuvagalam Vijayotsava Sabha:విజయనగరం జిల్లాలోని పోలిపల్లి పొలికేక పెట్టింది. రాష్ట్ర రాజకీయాల్లో నవశకానికి నాంది పలికింది. తెలుగుదేశం, జనసేన పొత్తు నిర్ణయం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి వచ్చిన తొలి సభ సూపర్ హిట్టయింది. 'మేటి ప్రజాశక్తుల మహా కలయిక నవశకం ప్రారంభ వేడుక’ అనే సభ ఉద్దేశానికి తగ్గట్టుగానే మొత్తం సభ జరిగింది.
సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో జనం పోటెత్తారు. టీడీపీ, జనసేన నాయకులు మైత్రీబంధానికి ఎంత విశేష ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పేందుకు ఈ సభ నిదర్శనంగా నిలిచింది. రెండు పార్టీలు పొత్తు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు, పొరపొచ్చాలు తలెత్తకుండా మైత్రీబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అది యువగళం సభలోనూ ప్రతిఫలించింది.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలి: చంద్రబాబు
ఇరుపార్టీల నాయకులకు సముచిత ప్రాధాన్యం:యువగళం-నవశకం.. ఇదేదో టీడీపీ సభ అన్నట్టు కాకుండా టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అన్న భావన కలిగించేలా నిర్వహించారు. అటు విశాఖ ఇటు విజయనగరం నుంచి దారి పొడవునా, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్రనేతల కటౌట్‌లు, ఫ్లెక్సీలు, జెండాలు, బెలూన్‌లు మొదలుకుని అన్నిటిపైనా ఇరుపార్టీల నాయకుల చిత్రాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణతో పాటు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సమానస్థాయిలో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో వారిద్దరూ సంయుక్తంగా ప్రచార సభల్లో పాల్గొన్నారు. సభలో అగ్రనేతల ప్రసంగాల్లోనూ పరస్పర గౌరవం, అభిమానం వ్యక్తపరిచారు. ఒకరి సుగుణాలను మరొకరు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వైఎస్సార్సీపీ పాలనలో ఏపీ అంధకారం - మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలి: పవన్ కల్యాణ్
పొత్తుకి విఘాతం కలిగించేవారు రాష్ట్ర ద్రోహులు:టీడీపీ, జనసేన అగ్రనేతలు మైత్రీబంధానికి ఎంత విలువ ఇస్తున్నారనడానికియువగళం సభనిదర్శనంగా నిలిచింది. టీడీపీతో పొత్తుని పూర్తిస్థాయిలో గౌరవిస్తూ, దాన్ని సమర్థంగా తీసుకెళ్లేవారికే పార్టీలో ప్రాధాన్యం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామని పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులకు విస్పష్టంగా చెబుతూ వస్తున్నారు. పొత్తుకి విఘాతం కలిగించేలా వ్యవహరించేవారు రాష్ట్ర ద్రోహులని స్పష్టం చేశారు. అదేస్థాయి చొరవ, నిబద్ధత టీడీపీలోను కనిపించింది.
ఆత్మీయనేస్తాన్ని, ఆత్మబంధువుని స్వాగతించినట్టుగా పవన్ కల్యాణ్‌కు తెలుగుదేశం నేతలు అపూర్వ స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ వేదిక వద్దకు రావడానికి కొంచెం ముందే చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ అక్కడికి చేరుకుని ముగ్గురూ ఆయన కారు వద్దకు వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పవన్‌ను వెంట తోడ్కొని వేదికపైకి తీసుకెళ్లారు. పవన్, బాలకృష్ణ ఒకరినొకరు సోదర సమానుడని సంబోధించుకున్నారు. పవన్ కల్యాణ్‌ను లోకేశ్, పవనన్న అంటూ ఆత్మీయత కనబరిచారు.
సమయం లేదు మిత్రమా - విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం: బాలకృష్ణ
ప్రభుత్వం బెదిరించినా తగ్గేదేలా అంటూ ముందుకు: యువగళం-నవశకం సభకు పసుపు దండు, జనసైనికులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా లెక్కచేయకుండా సభకు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా ప్రైవేటు బస్సులు ఇవ్వకుండా ప్రభుత్వం బెదిరించినా తగ్గేదేలా అంటూ సొంత వాహనాల్లో సభకు పోటెత్తారు. ఉదయం 11 నుంచే సభకు జన ప్రవాహం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సభా ప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. యువగళం-నవశకం సభ కనీవిని ఎరగని రీతిలో జరిగిందని టీడీపీ, జనసేన శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఒకే వేదికపైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బాలకృష్ణలను చూసి సంబరపడ్డారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే పోలిపల్లి సభ చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. 2024లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇరుపార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి. యువగళం విజయోత్సవసభకు వచ్చిన వాహనాల క్రమబద్ధీకరణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాహనాలను జాతీయ రహదారికి బదులు సర్వీసు రోడ్డుపైకి మళ్లించారు. దీంతో మూడు గంటలపాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు ఎటు కదల్లేక ట్రాఫిక్ స్తంభించిపోయింది.