TDP Avirbhava Sabha in Hyderabad today: తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్-నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇవాళ ఆవిర్భావ సభ అట్టహాసంగా నిర్వహించనున్నారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను తెలుగుదేశం ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో అలంకరించారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సభాస్థలికి చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
300 మంది ఆశీనులయ్యేలా సభా వేదిక : తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మంది పార్టీ ప్రతినిధులు ఆవిర్భావ సభలో పాల్గొంటారని... తెలుగుదేశం వర్గాలు అంచనా వేశాయి. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజక వర్గ ఇంఛార్జీలు కలిపి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది ఆశీనులయ్యేందుకు వీలుగా భారీ స్టేజ్ ని రూపొందించడం విశేషం. మరో వైపు సభకు వచ్చే వారికోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఇందుకోసం పార్టీ ప్రత్యేకంగా 11 కమిటీలను వేసి సభ ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.