ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో (ఈపీఎఫ్) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే.. దాని ద్వారా లభించే వడ్డీపై పన్ను విధించాలని ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించింది కేంద్రం. దీనికి బలమైన కారణమే ఉంది. అధిక నికర విలువ గల వ్యక్తుల (హెచ్ఎన్ఐ)కు చెందిన 1.2 లక్షల ఈపీఎఫ్ ఖాతాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరానికి పోగుబడిన మొత్తం రూ.62,500 కోట్లు. ఇందులో ఒక ఖాతాలోనే రూ.103 కోట్లు ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాధారణ ఉద్యోగులకు మేలు చేకూర్చేందుకు చందాతో పాటు వడ్డీకి కూడా మినహాయింపు ఇస్తుంటే అది.. హెచ్ఎన్ఐల రూపంలో పక్క దారి పడుతోందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే రూ.2.5 లక్షల మొత్తం వరకు చెల్లించే చందాపై వడ్డీకి మినహాయింపు ఇచ్చి, మిగతా వడ్డీపై సదరు చందాదారు వార్షికాదాయం ఆధారంగా వర్తించే శ్లాబు ప్రకారం.. పన్ను విధించాలని ఆర్థిక శాఖ ప్రతిపాదిచింది., 2018-19లో మొత్తం 4.5 కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందాదారులు ఉండగా, ఇందులో 1.23 లక్షల మంది హెచ్ఎన్ఐలు. వీరు ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఈపీఎఫ్ చందా చెల్లిస్తుండటం వల్ల అధిక మొత్తంలో వడ్డీ వీరికే అందుతోంది.
ఒక హెచ్ఎన్ఐ ఖాతాలో రూ.103 కోట్లు మరో రెండు ఖాతాల్లో రూ.86 కోట్లు పోగైంది. తొలి 20 హెచ్ఎన్ఐ ఖాతాల్లనే రూ.825 కోట్లు జమైంది. తొలి 100 హెచ్ఎన్ఐ ఖాతాల్లో మొత్తం రూ.2 వేల కోట్లు ఉన్నట్లు అంచనా.