అరేబియా తీర ప్రాంతాలను హడలెత్తిస్తున్న తౌక్టే తుపాను సోమవారం రాత్రి.. గుజరాత్ తీరాన్ని తాకింది. ఆ రాష్ట్రంలోని పోర్బందర్-మహువా మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించినట్టు పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర తీరంలో గంటకు సుమారు 185 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తున్నాయంది. రెండు గంటలపాటు ఇది తీవ్ర ప్రభావం చూపి.. ఆ తర్వాత బలహీనపడే అవకాశముందని వెల్లడించింది.
తౌక్టే ప్రభావంతో.. వెరవల్-సోమనాథ్ తీరంలో భారీఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. ఈ తుపాను ప్రభావంతో అప్రమత్తమైన అధికారులు.. గుజరాత్లో ఇప్పటికే సుమారు లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో భాగంగా.. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాయి.
విమానాశ్రయాలు బంద్..
తుపాను కారణంగా గుజరాత్లో విమానాశ్రయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. రాజ్కోట్ విమానాశ్రయం మినహా.. అన్ని విమానాశ్రయాలను ఈ నెల 19 వరకు మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో మూడు విమానాశ్రయాలు అహ్మదాబాద్, సూరత్, వడోదర విమానాశ్రాయాలు మంగళవారం వరకు మూతపడనున్నాయి.