Tata Airlines History: భారత్‌లో గగనయానం తొలిసారిగా 1911లో చోటు చేసుకుంది. 23 ఏళ్ల ఫ్రెంచ్ పైలెట్ హెన్రీ పీక్యూ ఇనుప వైర్లు కట్టిన చెక్క ఫ్రేమ్‌తో కూడిన హంబర్ బైప్లేన్‌ను అలహాబాద్‌లోని పోలో గ్రౌండ్ నుంచి నైని జంక్షన్ దాకా ఎగిరించారు. 6500 ఉత్తరాలను ఈ విమానం మోసుకొని వచ్చింది. 10 కిలోమీటర్ల ఈ దూరాన్ని చేరటానికి 13 నిమిషాలు పట్టింది.
ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు ఇలా ఉత్తరాల విమానాలు అడపాదడపా నడిచాయి. 1929లో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఇంపీరియల్ ఎయిర్‌వేస్ భారత్‌కు సేవలను మొదలెట్టింది. లండన్ నుంచి కరాచీకి తొలి విమానం 20 చోట్ల ఆగుతూ 6-7 రోజుల్లో చేరుకుంది.
అదే ఏడాది.. భారత తొలి ఫ్లయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా-బర్మా ఆరంభమైంది. ఈ క్లబ్ ద్వారా.. టాటా యువ వారసుడు జేఆర్‌డీ టాటా పైలెట్ లైసెన్స్ పొందారు. విదేశాల్లో విమాన పోటీల్లో పాల్గొని ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయనకు బ్రిటిష్ విమానయాన నిపుణుడు, మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరఫున యుద్ధ విమానాలు నడిపిన నెవిల్ విన్సెంట్ పరిచయమయ్యారు. భారత్‌లో విమానయానానికి మంచి భవిష్యత్ ఉందని ఊహించిన విన్సెంట్ తొలుత భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త సర్ హోమీ మెహతాను కలిశారు. కానీ ఆయన తిరస్కరించారు. దీంతో.. టాటాలను సంప్రదించారు. యువకుడే కాకుండా పైలెట్ లైసెన్స్‌తో ఉరకలెత్తుతున్న జేఆర్‌డీ తమ సంస్థ ఛైర్మన్ సర్ దొరాబ్జి టాటా వద్దకు ఈ ప్రతిపాదన తీసుకెళ్లారు. తొలుత అంతగా ఆసక్తి చూపని ఆయన.. చివరకు విన్సెంట్ మాటలకు అంగీకరించారు. రూ.2లక్షల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు.
Air India Back to Tata: వెంటనే దేశంలో ఎయిర్‌లైన్స్ ఆరంభించటానికి అనుమతులు కోరుతూ టాటాలు బ్రిటిష్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ తమ ఇంపీరియల్ ఎయిర్‌లైన్స్ సేవల్నే విస్తరించాలనుకున్న ఆంగ్లేయులు అనుమతులివ్వకుండా నాన్చసాగారు. మూడేళ్లపాటు కొర్రీలు పెడుతూ వచ్చారు. విన్సెంట్ మళ్ళీ రంగంలోకి దిగారు. బ్రిటిష్ బ్యూరోక్రసీని దాటి.. ఏకంగా వైస్రాయ్‌తో తేల్చుకోవటానికి సిద్ధపడ్డారు. సిమ్లా విడిదిలో ఉన్న లార్డ్ విలింగ్టన్ దగ్గరకు స్వయంగా వెళ్లారు. దొరాబ్జిని ఒప్పించినట్లే.. వైస్రాయ్‌నూ ఒప్పించారు. 1932 ఏప్రిల్ 24న పదేళ్ల ఒప్పందంతో అనుమతులు లభించాయి. టాటా ఎయిర్‌మెయిల్ ఆవిర్భవించింది. 1932 అక్టోబరు 15న కరాచీ నుంచి ముంబయికి తొలి టాటా విమానం గాల్లోకి ఎగిరింది. దాని సగటు వేగం గంటకు 80 కి.మీ. జేఆర్‌డీ టాటా తానే స్వయంగా పైలెట్‌గా వ్యవహరించారు. ఆ కాలంలో కరాచీ నుంచి ముంబయికి రైల్లో 45 గంటల సమయం పట్టేది. టాటా విమానం 8గంటల్లోపే చేరుకుంది. అహ్మదాబాద్‌లో ఆగినప్పుడు బర్మా షెల్ పెట్రోల్ డబ్బాలను ఎద్దుల బండిపై రన్‌వే వద్దకు తీసుకొచ్చి విమానంలోకి నింపారు. తర్వాత ముంబయి నుంచి బళ్లారి మీదుగా మద్రాసుకు బయల్దేరింది. అలా.. వారానికోసారి కరాచీ నుంచి మద్రాసుకు టాటా ఎయిర్ మెయిల్ కొనసాగింది.