అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగొయి కన్నుమూశారు. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన.. ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందారు.
84 ఏళ్ల గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారు. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదు. చివరకు సోమవారం సాయంత్రం కన్నుమూసినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
జననం
1934 అక్టోబర్ 11న అసోం జొర్హాత్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్లో తరుణ్ గొగొయి జన్మించారు. ఆయన తండ్రి డా. కమలేశ్వర్ గొగొయి అదే ప్రాంతంలో వైద్యుడు. తల్లి ఉష. 'హియార్ సమాహార్' కవితా సంకలనానికి ఉషా గొగొయికి పేరు లభించింది.
రంగాజన్ నిమ్న బునియాదీ విద్యాలయలో తరుణ్ గొగొయి తన విద్యాభ్యాసం ప్రారంభించారు. తర్వాత జొహ్రాత్ మదరసాలో చేరారు. బదులిపార్ టీ ఎస్టేట్లోని భోలాగురి హైస్కూల్లో ఆరో తరగతి వరకు చదువుకున్నారు. జొహ్రత్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య, జగన్నాథ్ బరూవా కళాశాల నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. గువహటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు.
1972 జులై 30న డాలీ గొగొయితో తరుణ్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కూతురు చంద్రిమా ఎంబీఏ పూర్తి చేయగా.. కుమారుడు గౌరవ్ ప్రస్తుతం కాలిబర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.
రాజకీయ జీవితం
1968లో గొగొయి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో జొర్హత్ మున్సిపల్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో ఐదో లోక్సభ(1971) ఎన్నికల్లో విజయం సాధించారు. 1976లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం 1977, 1980లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. 1985-90 మధ్య రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి దక్కించుకున్నారు. అదే సమయంలో అసోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
- 1991-93 మధ్య కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
- 1993-95 మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
- 1997లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మార్ఘెరీటా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
- 1998, 1999 సంవత్సరాల్లో జరిగిన 12, 13 వ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ హామీల కమిటీ, విదేశాంగ కమిటీ, సంప్రదింపుల కమిటీల్లో పనిచేయడం సహా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖను నిర్వహించారు.