ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని తపోవన్ హైడ్రో ప్రాజెక్ట్ సొరంగం వద్ద సహాయక చర్యలు పునఃప్రారంభమయ్యాయి. ధౌలీగంగ నదిలో నీటి మట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా ఆగిన సహాయక చర్యలను.. 45 నిమిషాల తర్వాత పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. చిన్న చిన్న బృందాలను సొరంగంలోకి పంపినట్లు వెల్లడించారు. ఈ సొరంగంలో 30 మందికి పైగా చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.
గౌచార్ ప్రాంతంలో మరో మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు. దీంతో మరణాల సంఖ్య 35కు చేరుకుందని చెప్పారు. 169 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
భారీ యంత్రాలతో డ్రిల్లింగ్
నీటి మట్టం పెరగక ముందు సొరంగంలో భారీ డ్రిల్లింగ్ యంత్రాలతో శిథిలాలను తొలగించారు. చిన్న మార్గం ద్వారా చిక్కుకున్నవారి వద్దకు చేరుకొని అత్యవసర పరికరాలను అందించాలని యత్నించారు. అయితే వరద ప్రభావంతో ఈ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. నీటిమట్టం పెరగగానే సిబ్బంది మొత్తం సహాయక చర్యలు విరమించుకొని బయటకు వచ్చేశారని అధికారులు తెలిపారు. అంతకుముందు, తవ్వకాలు జరిపే యంత్రం చెడిపోవడం వల్ల తపోవన్ సొరంగం వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
'12-13 మీటర్ల కింద ఉన్న టన్నెల్లోకి ప్రవేశించేందుకు ఉదయం రెండు గంటలకు సహాయ బృందాలు డ్రిల్లింగ్ ప్రక్రియ ప్రారంభించాయి. బురద, మంచుతోకూడిన నీరు భారీగా సొరంగంలోకి చేరుకున్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోపల చిక్కుకున్నవారి వద్దకు వెళ్లేందుకు భారీ యంత్రాలతో ఆపరేషన్ చేపట్టాం' అని ఐటీబీపీ ప్రతినిధి వివేక్ కుమార్ పాండే తెలిపారు.
180 మీటర్ల లోపల!
68 మీటర్ల లోపల డ్రిల్లింగ్ చేసినట్లు పవర్ ప్రాజెక్టు పనుల వద్ద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న గర్వాల్ కమిషనర్ రవినాథ్ రామన్ తెలిపారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర అత్యవసర పరికరాలను చిక్కుకున్నవారికి అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.