Tantrik Killed Woman : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ తాంత్రికుడి చర్యలకు మహిళ బలైంది. దెయ్యం వదిలిస్తానని చెప్పి తాంత్రికుడు.. మహిళ మెడపై కాలేసి తొక్కాడు. ఆ తర్వాత నీటిపైపుతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పిపడిపోయింది. ఎంత సేపైనా ఆమె మెలకువలో రాకపోవడం వల్ల ఆమె చనిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని పత్వారియా ప్రాంతానికి చెందిన ప్రియా సక్సేనాకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్తతో గొడవల కారణంగా ఆమె వేరేగా జీవిస్తోంది. అయితే కొన్నిరోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురైంది. మానసిక స్థితి చెడిపోయింది. దీంతో పుట్టింటికి వచ్చింది. ఇటీవలే వారికి ఒక తాంత్రికుడు పరిచయమయ్యాడు. ప్రియకు దెయ్యం పట్టిందని అతడు చెప్పాడు. ప్రియ అనారోగ్య సమస్యలను తాను నయం చేస్తానని నమ్మించాడు. అందుకు పలు పూజలు చెయ్యాలని మభ్యపెట్టాడు. శనివారం.. ప్రియ వాళ్ల పుట్టింట్లో హోమం నిర్వహించాడు.
చిత్రహింసలకు గురిచేసి..
Women Died Due To Tantrik : హోమం తర్వాత ప్రియను చిత్రహింసలకు గురిచేశాడు తాంత్రికుడు. ఆమె మెడపై కాలు వేసి తొక్కాడు. ఆ తర్వాత నీటి పైపుతో దారుణంగా కొట్టాడు. దీంతో ప్రియ అపస్మారక స్థితికి చేరుకుంది. అయితే ఏడు రోజుల్లో ఆమె అనారోగ్య సమస్యలన్నీ నయమవుతాయని తాంత్రికుడు చెప్పాడు. కాసేపట్లో మెలుకవలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు.
ఎంతకీ స్పృహలోకి రాకపోవడం వల్ల..
అయితే ఆదివారం ఉదయం వరకు ప్రియకు స్పృహ రాకపోవడం వల్ల కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో మరోసారి తాంత్రికుడిని పిలిచారు. అతడు మళ్లీ వచ్చి.. కాసేపట్లో స్పృహ వస్తుందని చెప్పి వెళ్లిపోయాడు. కానీ ఎంతకీ ఆమె మెలకువలోకి రాకపోవడం వల్ల ప్రియ చనిపోయినట్లు కుటుంబసభ్యులు గుర్తించారు.
ఈ మొత్తం విషయం పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రియా తండ్రి సురేశ్ చంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.