మరణించిన వ్యక్తి బతికొస్తాడన్న ఆశతో 30 గంటలు పూజలు చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
అసలేం జరిగిందంటే: మెయిన్‌పురి జిల్లాలోని జాటవాన్ మొహల్లా గ్రామానికి చెందిన తాలీబ్ చేతిపై శుక్రవారం వేకువజామున పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయినా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తాలీబ్ చనిపోయాడని నమ్మలేదు.
తాలీబ్‌ను ఎలాగైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో తాంత్రికులను, పాములను పట్టేవారిని తీసుకొచ్చారు అతడి కుటుంబ సభ్యులు. సుమారు 30 గంటలు పాటు తాంత్రికులు పూజలు చేశారు. మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి డప్పులు వాయిస్తూ భూతవైద్యం చేశారు. తాలీబ్‌కు కాటేసిన పామును పట్టుకునేందుకు నలుగురిని రప్పించారు. యువకుడి మృతదేహం వద్ద వేప, అరటి కొమ్మలను పెట్టి పూజలు నిర్వహించినా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇలా 30 గంటల పాటు శ్రమించినా తాలీబ్‌లో చలనం లేకపోవడం వల్ల ఆదివారం సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు.