రోడ్లపై ఎవరైనా చిరిగిన బట్టలతో, మాసిన జుత్తుతో కనిపిస్తే.. పక్కకు తప్పుకొని వెళ్లిపోతాం. వారిని చూసి చీదరించుకునేవారూ ఉన్నారు. ఇంకొందరు మంచి మనసుతో.. చేతనైతే పదో పాతికో సాయం చేసేవాళ్లుంటారు. అలాంటిది ఏ దిక్కూ లేని వారి గురించి అనునిత్యం ఆలోచిస్తూ వారి గురించి పరితపిస్తోంది.. ఓ 24 ఏళ్ల అమ్మాయి. వారికి ఆశ్రయం కల్పించి అండగా నిలుస్తోంది. తమ కాళ్లపై తాము నిలబడే విధంగా తీర్చిదిద్దుతోంది. ఆమె.. తమిళనాడు ఈరోడ్‌కు చెందిన మనీషా కృష్ణస్వామి.
మధ్యతరగతిలో జన్మించినా..
మనీషా దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయడానికి ఆసక్తి కనబర్చేది. ఎక్కువగా.. రోడ్లపై జీవించే వాళ్లకు పండ్లు, ఆహారం, దుప్పట్లు వంటివి పంపిణీ చేసేది. క్రమంగా.. వయసుతో పాటు తన సేవాదృక్పథం పెరుగుతూ వచ్చింది. పదవ తరగతి పూర్తవగానే... పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ... అందులో సంపాందించిన డబ్బులో కొంత వీరి కోసం ఖర్చు చేసేది.
వివక్షను ఎదుర్కొని..
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనేది మనీషా కోరిక. స్తోమత లేకపోవడం వల్ల... ఆశయాన్ని వదులుకుంది. కానీ వైద్యరంగంపై ఆసక్తితో... నర్సింగ్ పూర్తి చేసింది. ఆశలు, ఆశయాలు ఎలా ఉన్నా.. రోడ్లపై జీవించే అభాగ్యుల కష్టాలు తీర్చాలనే కోరికతో ఓ ఎన్జీఓలో చేరింది. అయితే అమ్మాయి కావడం వల్ల 'క్షేత్రస్థాయిలో నువ్వు సేవలేం చేస్తావు.. ఆఫీస్‌లో కూర్చొని పేపర్ పనులు చూసుకో' అని వివక్ష చూపించారు. ఈ నేపథ్యంలో.. ఆ ఎన్జీఓకు వీడ్కోలు పలికి.. సొంతంగా "జీవితం" అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది(jeevitham foundation).