పిల్లల చదువులు తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారాయనేది కాదనలేని సత్యం. అత్యధిక ఫీజులు చెల్లించి ఓ మంచి ప్రైవేట్ విద్యాసంస్థలో సీటు సంపాదించడం అంత తేలికేం కాదు. అయితే.. తమిళనాడులో చేపడుతున్న చర్యలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
తాంబూలంతో ఆహ్వానం..
విద్యాశాఖ అధికారులు నేరుగా విద్యార్థుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ఒప్పిస్తున్నారు. తాంబూలం అందించి ఆహ్వానిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. నిరంతర కృషి కారణంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల ఆలోచనా తీరు మారుతోందని విద్యాశాఖ అధికారి భక్త ప్రియ తెలిపారు.
ప్రత్యేక శిబిరాలు..
విద్యార్థుల చేరికను పెంచేందుకు అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో.. చెన్నై వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. మొత్తం 93,445 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే.. 18,991 మంది కొత్తగా నమోదైనట్లు పేర్కొన్నారు.