Tamilnadu Rains 2023 :తమిళనాడులో ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. పొలాలు, రహదారులు, వంతెనలు నీట మునిగాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఈ వర్షాల కారణంగా ఒకరు ప్రణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునల్వేలి, తూతుకూడి, తెన్కాసి జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. వరద ముప్పు పొంచి ఉన్న ప్రజలను హుటాహుటిన పునరావాస శిబిరాలకు తరలించారు. నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సహాయ చర్యలకు సైన్యం, నేవీ, వైమానికదళం సాయం కోరింది.
Tamil Nadu Rain News Holiday :విరుద్‌నగర్ జిల్లాను కూడా వర్షాలు ముంచెత్తగా జిల్లా కలెక్టర్ సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తూతుకూడి జిల్లాలోని కోవిల్‌పట్టి ప్రాంతంలో 40సరస్సులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక జలపాతాలకు వరద పెరిగింది. తిరునల్వేలిలోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 84 బోట్లను మోహరించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన తూతుకూడి, శ్రీవైకుంఠం తదితర పట్టణాలకు మరిన్ని బోట్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పజహయరు నది ఉద్ధృతికి కన్యాకుమారి జిల్లాలో పంట పొలాల్లో 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నాగర్‌కోయిల్ ప్రాంతంలో అనేక నివాసాలు నీటమునిగాయి. దక్షిణ జిల్లాల్లో NDRF, SDRF సిబ్బంది సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ 7,500 మందిని 84 పునరావాస కేంద్రాలకు తరలించారు. అప్రమత్తంగా ఉండాలని 62 లక్షల మందికి సంక్షిప్త సందేశాలను (ఎస్ఎమ్ఎస్) పంపించారు. తిరునల్వేలి-తిరుచెందురు సెక్షన్‌లో రైళ్లను నిలిపివేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శ్రీవైకుంఠం ప్రాంతంలో పలు చోట్ల రైలు పట్టాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల పట్టాలపై నుంచి వర్షపు నీరు పారుతోంది. దక్షిణ జిల్లాల మీదుగా నడిచే రైళ్లను పూర్తిగా రద్దుచేశామని మరికొన్నిటిని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. మరికొన్నిటిని దారిమళ్లించినట్లు వివరించారు.