తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారకం వద్ద.. ఆమె నెచ్చెలి శశికళ నివాళులు అర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్‌లో గల జయలలిత స్మారకాన్ని దర్శించిన శశికళ.. సమాధిపై పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయితే అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారులో జయ స్మారకం వద్దకు రావడం ప్రస్తుతం చర్చలకు తావిస్తోంది.
జయ స్మారకం వద్ద శశికళ నివాళులు అటు శశికళకు స్వాగతం పలికేందుకు వచ్చిన కార్యకర్తలు సైతం.. అన్నాడీఎంకే జెండాలతో కనిపించటం ఆసక్తి రేపుతోంది. అంతకుముందు.. శశికళ రాక గురించి సమాచారం అందుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు జయస్మారకం వద్దకు భారీగా తరలివచ్చారు.
శశికళ వ్యూహమేంటి?
అన్నాడీఎంకే స్వర్ణోత్సవంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శశికళ తర్వాతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనంతరం విడుదలైన శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటారని అంతా భావించారు. ఈ క్రమంలో హఠాత్పరిణామంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆమె. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారానికి దూరమైన తర్వాత కార్యకర్తలతో శశికళ ఫోన్లో మాట్లాడిన సంభాషణలు బయటికి వచ్చాయి. పార్టీని కచ్చితంగా కాపాడుతాం అంటూ ఆమె భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో శశికళ శనివారం జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై స్మారకాల వద్ద నివాళులర్పించడం ఆసక్తిగా మారింది.
అన్నాడీఎంకే స్వర్ణోత్సవం సందర్భంగా రామాపురంలోని ఎంజీఆర్ నివాసానికి వెళ్లనున్నారు శశికళ. ఆయా కార్యక్రమాల్లో శశికళ లభించే స్వాగతంపైనే ప్రజల మధ్యలో ఆమెకు ఎలాంటి చరిష్మా ఉందన్న అంశాల ఆధారంగా అన్నాడీఎంకేలో తిరిగి శశికళ స్థానం సంపాదిస్తారా? లేదా? అన్న విషయం స్పష్టం కానుంది.
అదే సమయంలో అన్నాడీఎంకే లో శశికళకుకు స్థానం లేదని ఎవరేం చేసినా భయపడే ప్రసక్తి లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. శశికళ చర్యలు ఎలా ఉంటాయి? ఆమె మద్దతుదారులతో ఏం మాట్లాడనున్నారు? అన్నాడీఎంకే ఎలా స్పందిస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం లభిస్తుందన్న భావన తమిళ రాజకీయాల్లో నెలకొంది.
ఇవీ చదవండి: