Tamilnadu Governor VS CM : తమిళనాడు గవర్నర్ ఉన్నత పదవిలో కొనసాగేందుకు అర్హుడు కాదని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, తమిళనాడులో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించారని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శనివారం రాసిన లేఖలో పేర్కొన్నట్లు తమిళనాడు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
"రాజ్యాంగంలోని 159వ అధికరణ ప్రకారం చేసిన ప్రమాణాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లంఘించారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఆయన చర్యల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది" అని ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలో ఆరోపించారు. మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి, తిరిగి ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గడం ద్వారా గవర్నర్ తన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని సీఎం లేఖలోపేర్కొన్నారు.
మరోవైపు.. గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతికి సంబంధించి.. ఆ పార్టీ నాయకులపై విచారణ విషయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి ఉదారంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ ఆరోపించారు. గత కొంత కాలంగా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఆయన ఈ పదవికి అర్హుడు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని పదవిలో కొనసాగించడం ఏ మాత్రం కరెస్ట్ కాదని, ఆయన్ను గవర్నర్ పదవి నుంచి తొలగించాలా? వద్దా? అనే నిర్ణయాధికారం రాష్ట్రపతికే వదిలిపెడుతున్నట్లు ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితమే మంత్రి బాలాజీని అవినీతి ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుంచి తొలగిస్తూ గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారు. అయితే, గవర్నర్ నిర్ణయాన్ని బీజేపీయేతర పార్టీలు ఖండించాయి. అంతకుముందు అసెంబ్లీలో తమిళనాడు, ద్రవిడ మోడల్ వంటి పదాలు, ద్రవిడ నాయకుల పేర్లను వదిలేసి గవర్నర్ ప్రసంగించడం కూడా వివాదాస్పదమైంది. ఆర్ఎన్ తీరుపై అధికార డీఎంకే కూటమి పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేశాయి.