తమిళనాడు కోయంబత్తూరును కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. అర్ధరాత్రి నుంచే టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ప్రజలు. అయితే.. టీకాలు అందుబాటులో లేవనే సమాధానంతో నిరసనలకు పాల్పడుతూ.. అధికారులతో వాదనకు దిగుతున్నారు. టీకాలు అందించేందుకు టోకెన్లను పంచకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు పది రోజుల తరువాత కోయంబత్తూర్లో కొవిడ్ టీకాల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. మొత్తం 31 కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్న సమాచారంతో అర్ధరాత్రి నుంచే ప్రజలు ఆయా టీకా కేంద్రాల వద్ద భారీ క్యూలలో వేచి ఉన్నారు.
అదుపుతప్పిన పరిస్థితి..
- వడ మధురై టీకా కేంద్రం వద్ద గుమిగూడిన ప్రజలు.. ఎంతసేపటికీ టోకెన్లు జారీచేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఆరోగ్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
- పీలామెడు మున్సిపల్ పాఠశాల వద్ద టోకెన్ల కోసం ఎదురుచూసి విసుగు చెందిన ప్రజలు టీకా కేంద్రం ముందు రోడ్డు దిగ్బంధించారు. రాజకీయ పార్టీలే టీకాలన్నీ తరలించుకుపోయాయని ఆరోపించారు. ప్రజలు ఆసక్తి చూపినప్పుడే టీకాలు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
- నాంచందపురంలో ప్రజలు అర్ధరాత్రి నుంచే లైన్లలో వేచి ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ.. గొడుగులు వేసుకొని మరీ వేచి ఉండటం గమనార్హం.
- నాదూర్లోని టీకా కేంద్రం వద్ద రాత్రి 8 గంటల నుంచి వేచి ఉన్న వారికి టోకెన్లు అందలేదు. ఈ కేంద్రంలో రోజుకు 300 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. దీనితో విసుగు చెందిన ప్రజలు.. మరుసటి రోజు టోకెన్లయినా ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. కానీ అది కుదరదని అధికారులు తేల్చిచెప్పారు.