Tamilnadu Bus Accident :ఊటీ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న ఓ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తమిళనాడులోని కూనూర్ సమీపంలోని మరపాలం వద్ద జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ మైనర్ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 59 మంది ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం..తెంకాసి జిల్లా కడయం ప్రాంతానికి చెందిన పర్యటకులు ఊటీ విహారయాత్రకు వెళ్లారు. పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 30) తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు కూనూర్‌లోని మలపాలం వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ మైనర్ సహా 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. PMNRF నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పును ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇక గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామన్నారు.