తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్నవేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే కూటములతో పాటు కొత్త పార్టీలు హోరాహోరీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికల సంగ్రామం ఇదే కావడం వల్ల అక్కడి రాజకీయాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో తమిళనాడులో కీలకంగా ఉన్న పలు అసెంబ్లీ నియోజకవర్గాలు, కీలక నేతల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం..
కంచుకోట నుంచి పళనిస్వామి..
ఈ సారి ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామిపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. అన్నాడీఎంకేలో 1974లో ఓ వాలంటీర్‌గా అడుగుపెట్టిన పళనిస్వామి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటికీ, కొంతకాలానికే ఆయన రాజీనామాతో పళనిస్వామి సీఎం పీఠమెక్కారు. ఇప్పటికే నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన పళనిస్వామి, ఎడప్పాడి స్థానం నుంచి మరోసారి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 37 ఏళ్ల సంపత్‌కుమార్‌ను డీఎంకే పోటీలో నిలబెట్టింది. స్థానిక వ్యక్తిగా ఉన్న తనకు ఇక్కడి సమస్యలపై పోరాటం చేస్తానని.. ముఖ్యమంత్రిపై గెలిపించాలని సంపత్ కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న ఎడప్పాడి నియోజకవర్గంలో తాను మరోసారి గెలుస్తానని పళని స్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బోడినాయక్కనూర్‌పైనే పన్నీర్‌సెల్వం..
ఓపీఎస్‌గా పేరొందిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో కీలక వ్యక్తి అనే చెప్పుకోవచ్చు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పన్నీర్ సెల్వం తాజాగా తేని జిల్లాలోని బోడినాయక్కనూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత రెండు పర్యాయాలుగా ఆయన బోడినాయక్కనూర్ నుంచే పోటీచేసి విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు మంచి పట్టున్నప్పటికీ డీఎంకే నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై 8శాతం ఓట్ల మెజారిటీతో పన్నీర్ విజయం సాధించారు. అయితే, అన్నాడీఎంకే నుంచి ఆండిపట్టి నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందిన తంగా తమిళ్‌సెల్వం ఈసారి డీఎంకేలో చేరిపోయారు. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం నియోజకవర్గమైన బోడినాయక్కనూర్ నుంచి తంగా తమిళ్‌సెల్వంను డీఎంకే బరిలో దింపింది. దీంతో ఈసారి అక్కడ ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:'అభివృద్ధి పేరుతో తమిళ ప్రజలకు మోసం'
కొళత్తూర్‌లో స్టాలిన్ vs ఆది రాజారాం..
కరుణానిధి మరణం తర్వాత.. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఎంకే స్టాలిన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన స్టాలిన్, హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి కొళత్తూర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెబుతోన్న స్టాలిన్.. ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో (2016) అన్నాడీఎంకే ప్రత్యర్థిపై 37 వేల ఓట్ల మెజారిటీతో స్టాలిన్ విజయం సాధించారు. అంతకుముందు 2011 ఎన్నికల్లో మాత్రం కేవలం 2 వేల ఓట్ల మార్జిన్‌తో మాత్రమే స్టాలిన్ గెలుపొందారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సీనియర్ నేత ఆది రాజారాం బరిలో ఉండడం వల్ల అక్కడ పోటాపోటీ నెలకొంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి నియోజకవర్గం అని పేరున్న కొళత్తూర్‌ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్టాలిన్ అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నారు.