Two Years Boy Died Eating Noodles: తమిళనాడు తిరుచ్చి జిల్లాలో రెండేళ్ల బాలుడి ఆకస్మిక మరణం.. అనేక అనుమానాలకు తావిచ్చింది. ఫ్రిజ్‌లో పెట్టిన నూడిల్స్ తినడం వల్లే చనిపోయాడని కుటుంబసభ్యులు చెప్పినా.. అతడి శరీరంపై గాయాలు ఉండడం చర్చనీయాంశమైంది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే హత్య కోణంలో దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ జరిగింది.. జిల్లాలోని సమయపురానికి చెందిన శేఖర్-మహాలక్ష్మి దంపతులకు సాయి తరుణ్ అనే రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నారి కొంత కాలంగా వివిధ అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకు తగ్గ చికిత్స పొందుతున్నాడు. అయితే శుక్రవారం(జూన్ 17) రాత్రి బాలుడి తల్లి మహాలక్ష్మి.. నూడిల్స్ వండింది. ముగ్గురూ తిన్నాక మిగిలిన నూడిల్స్ ఫ్రిజ్‌లో ఉంచింది. మరుసటి రోజు శనివారం (జూన్ 18) అదే నూడిల్స్‌ను తరుణ్‌కు అల్పాహారంగా పెట్టింది.
అది తిన్నాక ఇంట్లోనే తరుణ్.. వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంటనే చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, చిన్నారి శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో బాలుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు విషయం ఏదైనా దాస్తున్నారా అని పోలీసులు సందేహిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.