ఎంతో మంది మహిళలు స్కూటీలు, బైక్‌లు, కార్లు నడుపుతుంటారు. కానీ భారీ వాహనాలు నడపటం చాలా అరుదు. తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం.. ఏకంగా ప్యాసింజర్ బస్సునే నడుపుతోంది. ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేర్చుతోంది. పురుషులు మాత్రమే ఎంచుకునే బస్సు డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తోంది. ఆ యువతి పేరు షర్మిల. కోయంబత్తురులో ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తోంది.
మహిళా బస్సు డ్రైవర్ షర్మిల షర్మిలకు 24 సంవత్సరాలు. తండ్రి ఆటో డ్రైవర్. తండ్రి సహాయంతోనే డ్రైవింగ్ చేర్చుకుంది. 2019 నుంచి కోయంబత్తూరులో ఆటో నడుపుతోంది. అంతకుముందు ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసే వాహనం నడిపేది. షర్మిల డ్రైవింగ్ గురించి తెలుసుకున్న వీవీ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ.. పిలిచి మరీ ఉద్యోగంలో చేర్చుకుంది. దీంతో కోయంబత్తురులోనే మొదటి మహిళ బస్ డ్రైవర్‌గా నిలిచింది షర్మిల. ప్రస్తుతం గాంధీపురం నుంచి సోమనూరు మార్గంలో బస్సును నడుపుతోంది. తన డ్రైవింగ్ నైపుణ్యాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. స్థానికుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. చిన్నప్పటి నుంచే డ్రైవింగ్‌పై ఆసక్తి కనబరిచిన షర్మిలా.. 7వ తరగతిలో ఉండగానే వాహనాలు నడపటం మొదటి పెట్టింది.
మహిళా బస్సు డ్రైవర్ షర్మిల
"వీవీ ట్రాన్స్పోర్ట్ అనే సంస్థ వారు డ్రైవింగ్ టెస్ట్ పెట్టారు. దాంట్లో పాస్ అయ్యాను. దీంతో నున్ను డ్రైవర్‌గా ఎంపిక చేశారు. చాలా సంతోంషంగా ఉంది. ఇది కష్టమైన పనే అయినటప్పటికి ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఉద్యోగం చేస్తున్నాను. డ్రైవర్ పని సులభమని చాల మంది అనుకుంటారు. కానీ ఇది కష్టమైన పని. ఈ సీట్లో కూర్చుంటే ఈ పని ఎంత కష్టమో తెలుస్తుంది. నేను సిలిండర్ బండి నడిపాను. కారు ట్యాక్సీ నడిపాను. ఆటో నడిపాను. కరోనా సమయంలో పేషేంట్లను తరలించాను.
-షర్మిలా
షర్మిలకు డ్రైవింగ్ నేర్పించడంలో తన తండ్రి కీలకంగా వ్యవహరించాడు. ఆమె భారీ వాహనాలు నడపటం, ట్రైనింగ్ తీసుకోవటం, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందటంలో కూతురికి చేదోడుగా ఉన్నాడు. ఇప్పుడు తన కూతురు రద్దీ రోడ్లపై బస్సును నడపటం చూసి మురిసిపోతున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమె కోరికకు అడ్డు చెప్పలేదు. డ్రైవింగ్ చేస్తానన్న కోరికను మన్నించి.. ఆమెకు అండగా నిలిచారు.
షర్మిల బస్సు నడపటం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఆమెను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. బస్సులో ఎక్కే ప్రయాణికులు షర్మిలతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. యువతి నడిపే బస్సు ఎక్కడం.. చాలా కొత్తగా అనిపిస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.
మహిళా బస్సు డ్రైవర్ షర్మిల