పామును చూస్తే భయంతో అంత దూరం పారిపోతాం. ఎక్కడ కాటేస్తుందోనని భయపడి.. కొందరు కొట్టేందుకు వెనుకాడరు. అయితే.. ఇంట్లోకి వస్తున్న పామును బుజ్జగించి, బయటకు పంపించడం సాధ్యమేనా? పామును బుజ్జగించడం ఏంటని ఆశ్చర్యపోకండి. ఇదే జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లోకి నాగుపాము రాబోయింది. దానిని చూసి ఏ మాత్రం భయపడని ఆమె.. చిన్న కర్రపుల్ల తీసుకొని బయటకు పంపేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే పాముతో ఆమె వ్యవహరించిన తీరు నవ్వు తెప్పిస్తోంది. చాలా పద్ధతిగా సర్పాన్ని బుజ్జగిస్తూ, నచ్చజెప్పడం వీడియోలో చూడొచ్చు. బయటకు వెళ్తే పాముకు పాలు పోస్తానని, గుడ్లు ఇస్తానని వాగ్దానమూ చేసింది. చివరకు.. కర్రపుల్లతో చప్పుడు చేస్తూ పామును ఎలాగోలా వెనక్కి వెళ్లిపోయేలా చేసింది.