భాజపా సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారికి చేరుకున్నారు. సుచీంద్రంలో.. భాజపా తరఫున ఇంటింటి ప్రచారంలో భాగంగా నిర్వహించిన 'విజయ్ సంకల్ప్ మహాసంపర్క్' యాత్రలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన షా.. స్థానికంగా 11 ఇళ్లను సందర్శించి ఓట్లు అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ.. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి పట్టం కట్టాలని తమిళ ఓటర్లను కోరారు.
శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే-భాజపా-పీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట.. కన్యాకుమారి ఎంపీ అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్ ఉన్నారు.
కన్యాకుమారి లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి పొన్ రాధాకృష్ణన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు అమిత్ షా. ఇంటింటి ప్రచారంలో విజయ సంకేతం చూపించారు.