తమిళ సంస్కృతి మూలాలను గుర్తించేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తమ పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసెంబ్లీలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, కేరళలోనూ తవ్వకాలు జరుగుతాయని వెల్లడించారు. తమిళనాడు నాగరికతకు సంబంధించి 3,200 ఏళ్ల క్రితం నాటి ఓ వస్తువు లభించినట్లు ప్రకటించారు.
తమిళనాడు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ కీలక వస్తువుల గురించి గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు స్టాలిన్. శివకాలై ప్రాంతంలో మట్టిపొట్టుతో ఉన్న బియ్యం పాత్రను గుర్తించినట్లు చెప్పారు. దీని కార్బన్ డేటింగ్ కోసం(ఏ కాలం నాటితో తెలుసుకోవడం) అమెరికా మయామిలోని యాక్సిలరేటర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ(ఏఎంఎస్)కు పంపినట్లు తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను అసెంబ్లీలో ప్రకటించారు.
"ఇటీవలే ఈ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈ బియ్యం నమూనాలు 1,155 బీసీఈకి చెందినవని ప్రకటించేందుకు సంతోషంగా ఉంది. తమిరపారాణి నది నాగరికత 3,200 ఏళ్ల నాటిదని ఆధారాలతో రుజువైంది." అని స్టాలిన్ ప్రకటించినప్పుడు అసెంబ్లీ బల్లల మోతతో దద్దరిల్లింది.
ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటికే ఆధిచనల్లూర్లో 900 బీసీఈకి చెందిన వస్తువులు, కోర్కైలో 800 బీసీఈకి చెందిన వస్తువులను గుర్తించారు. అయితే తాజా పరిశోధనలో లభించిన ఆనవాళ్లు అంతకంటే చాలా ఏళ్ల ముందునాటివి. ఒకప్పటి పరిపూర్ణ నాగరికత తమిరపారాణి నదితో ముడిపడి ఉందని ఇవి స్పష్టం చేస్తున్నాయి. దీన్ని పూర్వకాలంలో పోరునై నది అని పిలిచేవారు. కోర్కై ఓవరేవుగా ఉండగా.. ఆధిచనల్లూరు, శివకాలై ఆవాసాలుగా ఉన్నాయి.
తమిళ ఆనవాళ్లను గుర్తించేందుకు కీలడి, ఆధిచనళ్లూర్, శివకాలై, కోర్కై, కోడుమనల్, మయిలాదుంపరై, గంగైకొండ చోళాపురం ప్రాంతాల్లో రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతోంది. కోర్కైలో లభించిన ఓ వస్తువు 600 బిసీఈకి చెంది ఉంటుందని ఏఎస్ఐ మాజీ డైరెక్టర్ జరనల్ రాకేశ్ తివారీ, హిందూ బెనారస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్ర ఎన్ సింగ్ అభిప్రాయపడ్డారు.